ఓయూ విద్యార్థుల పిటిషన్‌ కొట్టివేత

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఉస్మానియా యూనివర్సిటీలో నీరు, విద్యుత్‌ కొరతల పేరుతో వేసవి సెలవులు ఇచ్చారనే సందర్భం గా వెలువడిన సర్క్యూలరు వివాదం పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. నీరు, విద్యుత్‌ కొరత కారణంగా సెలవులు ప్రకటించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారంటూ దశరథ్‌ ఇతర విద్యార్థులు పోలీసు లకు ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయలేదని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని కొట్టేస్తూ జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి మంగళవారం తీర్పు చెప్పారు. మే మొదటి వారంలో రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. గతేడాది వేసవి సెలవుల సర్క్యూలర్‌ను సీఎం ట్వీట్‌ చేశారనీ, అప్పుడు నీరు, విద్యుత్‌ కొరత లేదనీ, తప్పుడు సర్క్యూలర్‌ను ట్వీట్‌లో పేర్కొన్నారని పిటిషనర్ల వాదన. సీఎం ట్వీట్‌లోని సర్క్యూలర్‌ నిజమైనదని ప్రభుత్వ వాదన. సీఎం ట్వీట్‌పై ఒక విద్యార్థి చేసిన ట్వీట్‌ లోనిదే నకిలీదని యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. వాదనల తర్వాత అధికారుల ఫిర్యాదు పై పోలీసుల దర్యాప్తులో సర్క్యూలర ్‌పై నిజానిజాలు తేలుతాయనీ, పిటిషన్‌ను కొట్టి వేస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు.

Spread the love