నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డులో అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు యూనిఫాం లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన చిన్నారికి చేరేలా కృషి చేయాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్య విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. యూనిఫాం ధరించడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన పెంపొందడం తో పాటు విద్యపై ఆసక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
వార్డులో చిన్నారుల సంక్షేమం, విద్యాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారులు ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, దయాకర్, కరుణ, రాంబాబు, శేఖర్, మస్తాన్, బాలాజీ, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



