సోమవారం నాటి జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం రద్దు

-15 రోజుల తర్వాత జిల్లా స్థాయి ప్రజావానికి పంపాలి 
– జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఈ సోమవారం జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోమవారం నుండి మండల స్థాయిలోనే జిల్లా స్థాయిలో నిర్వహించినట్లుగానే ప్రజావాణి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదుదారులు జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సమర్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వారం  నుండి నల్గొండ జిల్లాలోని 33 మండలాలతో పాటు, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలలో సైతం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఆయా మండలంలోని ప్రజలు వారికి సంబంధించిన ఫిర్యాదులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించాలని కోరారు.  మండల స్థాయిలో సైతం జిల్లా లో మాదిరిగానే ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుందని , మండల స్థాయి లో అన్ని రకాల సమస్యలను ప్రజావాణిలో సమర్పించవచ్చని తెలిపారు. ముఖ్యంగా  అభివృద్ధి,సంక్షేమకార్యక్రమాలతో పాటు, భూములు, ఇతర  సమస్యలను సైతం ఈ ప్రజావాణి కార్యక్రమాల్లో సమర్పించవచ్చని పేర్కొన్నారు.మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఎంపీడీవో అధ్యక్షతన జరుగుతుందని, మండల ప్రత్యేక అధికారి తహసిల్దార్, మండల విద్యాధికారి ,వ్యవసాయ అధికారి, ఏపిఎం తోపాటు,ఇతర అధికారులు మండల ప్రజావాణి కార్యక్రమంలో ఉంటారని, జిల్లాలో  మాదిరిగానే ఫిర్యాదుదారులకు రసీదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  అంతేకాక ప్రతి ఫిర్యాదుకు ఒక ఒక ఐడి నెంబర్ ను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. మండల స్థాయిలో పరిష్కారం కానీ ఫిర్యాదులు 15 రోజుల తర్వాత జిల్లా స్థాయి ప్రజావాణిలో సమర్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో  తిరిగి ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు  నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని ఆయన స్పష్టం చేసారు.
Spread the love