నవతెలంగాణ -పరకాల : పాలిటెక్నిక్, ఐటీఐ విద్యను ‘శక్తి స్కీమ్’లో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. శక్తి స్కీమ్‌పై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, తమ భవిష్యత్‌కు నష్టం కలిగించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన డీఐఓఎస్ నంబర్ 97లోని నాలుగో పాయింట్‌లో పాలిటెక్నిక్, ఐటీఐ విద్యను శక్తి స్కీమ్‌లో విలీనం చేసే అంశాన్ని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అమలైతే డిప్లొమా విద్యకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, విలువ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో సాంకేతిక సబ్జెక్టులతో పాటు ప్రాక్టికల్స్ ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు పొందుతున్నామని, కోర్సు పూర్తయిన అనంతరం వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందడంతో పాటు బీటెక్ వంటి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
పాలిటెక్నిక్ విద్యను ఐటీఐతో విలీనం చేస్తే తమకు భవిష్యత్‌లో ఉద్యోగ, ఉన్నత విద్య అవకాశాలు ఎలా ఉంటాయనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. డిప్లొమా సర్టిఫికెట్‌కు ప్రస్తుతం ఉన్న విలువ, ఉద్యోగ అవకాశాలు కొనసాగుతాయా లేదా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. శక్తి స్కీమ్ వల్ల తమకు కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు గత రెండు, మూడు వారాలుగా ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన స్పందన రాలేదని తెలిపారు. ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆందోళనల కారణంగా తరగతులు సక్రమంగా జరగక పరీక్షలకు సిద్ధం కాలేకపోయామని పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో పరీక్షలతో పాటు మధ్యంతర పరీక్షలు కూడా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. తరగతులు సక్రమంగా జరగక, తాము చదువుకోలేని పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ముందుగా పరీక్షలను వాయిదా వేసి, శక్తి స్కీమ్‌పై పూర్తి స్పష్టత ఇచ్చిన తర్వాతే పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. తమ భవిష్యత్‌కు సంబంధించిన అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా విద్యార్థులతో చర్చించాలని, శక్తి స్కీమ్‌లో పాలిటెక్నిక్ విద్యను ఐటీఐతో విలీనం చేయకుండా తమ ప్రత్యేకతను కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.


