అంగన్‌వాడీలను ఇంటికి పంపొద్దు

– సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జులైలో ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, కోశాధికారి పి.మంగ లేఖ రాశారు. సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయలు చెల్లించి వీఆర్‌ఎస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్‌వాడీ ఉద్యోగుల స్థితిగతులు, 24 రోజులు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు, ఉద్యోగ విమరణ ప్రయోజనాల విషయాలపై మంత్రి, ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లామని తెలిపారు.
వాటిని పట్టించుకోకపోగా అంగన్‌వాడీలు వ్యతిరేకించిన జీవో నెంబర్‌ 10ని అమలు చేయాలని చూడటం దారుణమని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా జూన్‌ 7 న ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ ముందు ధర్నా నిర్వహించామని గుర్తుచేశారు. మంత్రి సీతక్క, ఐసీడీఎస్‌ డైరెక్టర్‌ న్యాయం చేస్తామని హామీనిచ్చారని తెలిపారు. ఇప్పుడు అతి తక్కువ డబ్బులు చెల్లించి ఇంటికి పంపించాలని నిర్ణయించడం మోసం చేయటమేనని పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు న్యాయం చేకూరేలా కొత్త జీవోలను విడుదల చేయాలని కోరారు.

Spread the love