రక్షణ బాధ్యత తీసుకోరా?

– ఉద్యోగ హామీ పొందరా?
– కార్మికులను ఇజ్రాయిల్‌ పంపడంపై సీఐటీయూ మండిపాటు
న్యూఢిల్లీ: కార్మికుల రక్షణకు ఎలాంటి బాధ్యత తీసుకోకుండా, వారి ఉద్యోగాలు, ఆదాయాలపై హామీలు పొందకుండా వారిని ఇజ్రాయిల్‌కు పంపడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. పాలస్తీనాపై ఆమానుషమైన, ఆటవికమైన మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌కు మన కార్మికులను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మండిపడింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
‘కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కార్మికులను ఇజ్రాయిల్‌ పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ కుటిల యత్నాలకు లొంగిపోవద్దు. ఇజ్రాయిల్‌లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడి ప్రభుత్వం పాలస్తీనాపై మారణహోమం సాగిస్తూ వేలాది మంది పాలస్తీనా కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది’ అని ఆ ప్రకటనలో కార్మికులను కోరింది.
జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి (ఎన్‌ఎస్‌డీసీ) వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ గత సంవత్సరం నవంబరులో ఇజ్రాయిల్‌తో మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ ఒప్పందం ప్రకారం నిర్మాణం వంటి నిర్దిష్ట కార్మిక రంగాలలో తాత్కాలిక ఉపాధి నిమిత్తం ఇజ్రాయిల్‌కు భారతీయ కార్మికులను పంపుతుంది. పాలస్తీనాపై యుద్ధం సాగిస్తూ వేలాది మందిని ఇజ్రాయిల్‌ పొట్టనపెట్టుకుంటున్న సమయంలోనే ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని సీఐటీయూ, దాని అనుబంధ భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య (సీడబ్ల్యూఎఫ్‌ఐ) తీవ్రంగా ఖండించాయి. ఇది దేశంలోని వేలాది మంది నిరుద్యోగ యువతను మరణం అంచుకు నెట్టడం తప్పించి మరోటి కాదని సీఐటీయూ వ్యాఖ్యానించింది.
గాజాపై ఇజ్రాయిల్‌ ప్రారంభించిన ఆటవిక దాడి 100వ రోజుకు చేరింది. ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు యువకులను ఉద్యోగాల కోసం ఇజ్రాయిల్‌కు పంపేందుకు ఎంపిక ప్రక్రియ జరుపుతున్నాయి.
అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ కానీ, ఎన్‌ఎస్‌డీసీ కానీ అక్కడికి వెళ్లే కార్మికుల భద్రత, భవిష్యత్తుపై ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదు. వారి సామాజిక భద్రత గురించి, ఇతర రకాలుగా కార్మికులకు కనీస రక్షణ కల్పించడం గురించి పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఇజ్రాయిల్‌లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాన్ని గురించి బోధించే పేరుతో నిరుద్యోగ యువత నుండి సంబంధిత మంత్రిత్వ శాఖ పది వేల రూపాయల చొప్పున దోచుకుంటోంది.
ఇజ్రాయిల్‌కు కారుచౌకగా కార్మికులను పంపేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు విరుద్ధంగా ఉన్నాయని తపన్‌ సేన్‌ ఆ ప్రకటనలో విమర్శించారు. ఆటవిక దాడులకు తెగబడుతున్న యుద్ధోన్మాద ఇజ్రాయిల్‌కు బాసటగా నిలుస్తూ, భారతీయ కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. ఇలాంటి ఆటవిక చర్యలకు వెంటనే స్వస్తి చెప్పాలని ఆయన కోరారు.

Spread the love