దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు..

with thieves Do not worry about Kalisetola..– పార్టీనే నాయకులను తయారు చేస్తది
– ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌
– దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదు..
నవతెలంగాణ-మర్కుక్‌
పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధ లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల పరిధిలోని ఎర్రవల్లిలో గల వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కూడా వివిధ ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ మాట్లాడారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు కేసీఆర్‌తో ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. అనంతరం ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని, పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని కేసీఆర్‌ అన్నారు. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప, నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. నాడైనా నేెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే, మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని చెప్పారు. ‘మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండు. బాధ పడేదేమీలేదు. ఆయనను తయారుచేసింది పార్టీనే అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటది.” అని వివరించారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను,కలలను నెరవేర్చగలిగే అవగాహన బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని అన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన బిఆర్‌ఎస్‌ కు మాత్రమే ఉందని కేసీఆర్‌ వివరించారు. అంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలతో కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, కోరుట్ల, హుజురాబాద్‌ ఎమ్మెల్యేలు డా. సంజరు, కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, జీవన్‌ రెడ్డి, జాజాల సురేందర్‌, గంప గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే, ఎల్‌ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మెన్‌ వసంత సురేష్‌, పెద్దపల్లి నేత ఉష తదితరులున్నారు.
ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్వహించే ఆత్మీయ సమావేశాలకు శనివారం నుంచి సోమవారం వరకు మూడురోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యుల సూచనల మేరకు కేసీఆర్‌కు మూడు రోజుల పాటు విశ్రాంతినివ్వాలని కార్యకర్తలను కోరింది. తిరిగి ప్రకటన తర్వాతే తదుపరి సమావేశాలు పున: ప్రారంభం అవుతాయని తెలిపింది.

Spread the love