ఢిల్లీ రూపు’రేఖ’ మార్చేనా?

 Sampadakiyamఇరవై ఏడేండ్ల సుదీర్ఘ విరామ అనంతరం ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అధిరోహించింది. ఊహగానాలకు తెరదించుతూ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖాగుప్తాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మొన్న గురువారం రాంలీలా మైదానంలో సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. ఇప్పటివరకు ఢిల్లీని పాలించిన వారిలో తొమ్మిదవ ముఖ్యమంత్రి. మహిళల్లో నాలుగో వ్యక్తి. షీలాదీక్షిత్‌, సుష్మాస్వరాజ్‌, అతిశీ, తాజాగా రేఖా. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఆమె హస్తినను ఎలా పాలిస్తారనే వైపు మరలింది. ఇంతకీ ఢిల్లీకి కావాల్సిందేమిటి? అక్కడున్న ప్రధాన సమస్య లేమిటి? కొత్తగా ఎన్నికైన రేఖా గుప్తా రాష్ట్ర రూపురేఖలు మారుస్తారా? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారా? ఇప్పుడు రాజకీయవర్గాలు, ప్రజానీకంలో జరుగుతున్న ప్రధానమైన చర్చ.
దేశ రాజధాని అయిన ఢిల్లీకి ప్రపంచ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకుగాను మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, ఢిల్లీని చూసి దేశమంతా ఎలా ఉంటుందో ఊహించుకునేలా హస్తినను తయారు చేస్తామని బీజేపీ నాయకత్వం చెబుతున్నది. కానీ అసలు సమస్యను పట్టించుకోకపోవడం విచిత్రం. దశాబ్దాలుగా ఢిల్లీని వణికిస్తున్నది వాయు కాలుష్యం. ప్రపంచంలోనే అత్యధిక కాలు ష్యపు నగరాల్లో ఒకటిగా మారింది. దీన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు పాలకవర్గాలు తీసుకున్న చర్యలు శూన్యం. గత ఏప్రిల్‌ నాటికి నగరంలో 1.72 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు పోగవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ కాలుష్యం నగరవాసుల సగటు జీవితకాలం పన్నెండేండ్లకు తగ్గిస్తుందని అనేక నివేదికలు ఘోషిస్తున్నాయి. కొత్తగా పగ్గాలు చేపట్టిన బీజేపీకి దీనిపై స్పష్టత లేకపోవడం మరీ ఘోరం. పైపై మెరుగులను ప్రాధాన్యతగా చెబుతున్న ‘డబులింజన్‌’ సర్కార్‌ ఈ కాలుష్యాన్ని ఎలా అధిగమిస్తుందని చెప్పాల్సిన బాధ్యత రేఖా ప్రభుత్వానిది.
కోటిన్నరకు పైగా జనాభా నివాసముండే ఢిల్లీ నూట నలభై దేశాలతో పోలిస్తే పెద్దది. 2028 నాటికి జపాన్‌లోని టోక్యోను అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా. అంతకంటే ముందు దేశ రాజధాని కావడంతో ఉన్న ఊళ్లో పని దొరకని వారు ఉపాధి అవ కాశాలను వెతుక్కుంటూ ఢిల్లీబాట పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు, గ్రామాల్లో భరోసానిచ్చే కార్యక్రమాలు పాలకులు ప్రవేశపెట్టకపోవడంతో వలసలు అధికమై అక్కడి వనరులపై ఒత్తిడి పెరుగుతున్నది. తరచూ మంచినీటి సంక్షోభం తలెత్తుతున్నది. ఈ సమస్యకు ముందు పరిష్కారం చూపాలి. అంతే కాదు, ఢిల్లీలోకి స్వచ్ఛంగా ప్రవేశించే యమునా నది నీళ్లు రాజధానిని వీడే ప్రాంతంలో అత్యధికంగా కాలుష్యమయంగా మారుతున్నాయని అధికార పరీక్షల్లో రుజువైంది. యమునా నది మొత్తం కలుషితమవుతున్నదని, దీన్ని ఆప్‌ పట్టించుకోవడం లేదని గత సర్కార్‌పై గగ్గోలుపెట్టిన బీజేపీ ఇప్పుడు అధికారం చేపట్టింది. తగిన చొరవ తీసుకుంటుందా లేదా అనేది నగరవాసుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఇవేకాదు, ఇరుకు రోడ్లు, మురుగునీరు, వ్యర్థాల కాల్చివేత లాంటివి ఢిల్లీని వేధిస్తున్న నిత్య సమస్యలు.ఈ నేపథ్యంలో ఢిల్లీని సుందరంగా తీర్చిదిద్దడం కాదు, ముందుగా ప్రజల్ని పట్టి పీడిస్తున్న కలుషితపు నీరు, గాలి, పారిశ్రామిక కాలుష్యం, రహదారులపై దుర్ఘంధం, తదితర మౌలిక వసతులపై దృష్టి సారించాలి.
ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మత సామరస్యం. ఇప్పటివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన మత కలహాలను చూస్తే ఎవరికైనా ఆందోళన కలగక మానదు. ఎందుకంటే, బీజేపీ నమ్ముకున్నది ప్రజల్ని కాదు, ప్రజా సంక్షేమాన్ని అంతకన్నా కాదు.మతం, దాంతో చేసే రాజ కీయం! అందుకే గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో విపరీతమైన అల్లర్లు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం బీజేపీకి దేశ రాజధాని ఢిల్లీ తమ చేతుల్లో లేదనే తీవ్రమైన అసంతృప్తి ఉండేది.ఇప్పుడు అధికారం హస్తగతమైన నేపథ్యంలో భిన్నమతాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు, సంస్కృతికి నిలయమై ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలో మత బీజాలు నాటితే మాత్రం ముమ్మాటికీ బీజేపీని ప్రజలు క్షమించరు. ఆ పరిస్థితి రాకుండా చూసుకుంటారని ఆశిద్దాం.

Spread the love