Tuesday, March 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమా గోస పట్టదా..?

మా గోస పట్టదా..?

- Advertisement -

అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలు పరిష్కరించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌
పెంబి నుంచి నిర్మల్‌ కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర
కలెక్టర్‌కు వినతిపత్రం
సమస్యల అధ్యయనానికి టీమ్‌ను పంపుతాం : కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నవతెలంగాణ- నిర్మల్‌టౌన్‌
నిర్మల్‌ జిల్లా పెంబి మండల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ(ఎం) నిర్మల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెంబి మండల సమస్యల పరిష్కారానికి చేపట్టిన పాదయాత్ర సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుంది. గిరిజనులు, సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కలెక్టరేట్‌కు చేరుకొని సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ గిరిజనుల వద్దకొచ్చి వినతిపత్రం స్వీకరించారు.

ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ..పెంబి మండల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, విద్యుత్‌, తాగునీరు, ఆరోగ్యం తదితర సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామన్నారు. యాపల్‌గూడెం నుంచి నిర్మల్‌కు సుమారు 75కిలో మీటర్లు 3రోజుల పాటు పాదయాత్ర కొనసాగిందన్నారు. పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చామని, చొరవ చూపి వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా దోత్తి, కడెం వాగులపై వంతెనలను తక్షణమే నిర్మించాలని, పెంబి-పులగంపండ్రి నుంచి సిరిచల్మా వరకు రహదారి నిర్మించాలని, పసుపుల, మందపెల్లి, రాజురా వంతెనల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అటవీ శాఖ అనుమతులు తక్షణమే ఇవ్వాలని కోరారు. అన్ని గ్రామాలకూ త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రికి రెగ్యులర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను నియమించాలని, గిరిజన గ్రామాల్లో అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కొలంగూడ గ్రామంలో ఇండ్ల నిర్మాణాలను ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకుంటున్నారని, వెంటనే అనుమతులు ఇవ్వాలని, రోడ్డు, తాగునీటి కోసం అదనపు చేతి పంపులు ఏర్పాటు చేయాలని కోరారు.

సమస్యల అధ్యయనానికి టీమ్‌ను పంపుతాం : కలెక్టర్‌
పెంబి మండలంలో సమస్యల అధ్యయనానికి టీమ్‌ను పంపించి నివేదిక తెప్పించుకుంటామని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ హామీ ఇచ్చారు. గిరిజనుల వద్ద కొచ్చి సమస్యలు విన్న కలెక్టర్‌ పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పెంబి మండల బ్లాక్‌పై తమకు అభిమానం ఉందని, కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, మరికొన్ని సమస్యల పరిష్కారానికి సమయం తీసుకుంటామని తెలిపారు. వెంటనే మెడికల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని, అంగన్‌వాడీ టీచర్‌కు ఇప్పటికే ఎఫ్‌ఏసీ ఇచ్చామని చెప్పారు.

అధికారుల నివేదిక ఆధారంగా సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లతో వారం వారం సమావేశం నిర్వహించి రోడ్లు ఇతర మౌలిక వసతుల కల్పించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్‌, పూసం సచిన్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గౌతమ్‌కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం నూతన కుమార్‌, బొమ్మెన సురేష్‌, వసుంధర, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు, ఫసీఉద్దీన్‌, నాగెల్లి నర్సయ్య, ముత్యం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు విజయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ దిగంబర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -