విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌పై అపోహలొద్దు

– టీజీఎస్‌పీడీసీఎల్‌ ఎమ్‌డీ ముషారఫ్‌ అలీ ఫారూఖి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌పై అపోహలొద్దని దక్షిణ తెలంగాణ పంపిణి సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా మీటర్‌ రీడింగ్‌ తీయాల్సినప్పటికీ, కొన్ని సందర్భాల్లో రెండు, మూడు రోజులు ఆలస్యంగా తీస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఆ నెలలో వినియోగించిన యూనిట్లు పెరిగి స్లాబ్‌ రేటు మారడంతో అధిక బిల్లులు వస్తున్నాయనే ప్రచారం సరికాదన్నారు. 99.5 శాతం బిల్లులు నెల రోజులకే ఇస్తున్నామనీ, అనివార్య పరిస్థితుల్లో ఆలస్యం జరిగితే వినియోగదారులు నష్టపోవద్దనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. రీడింగ్‌ తీసిన రోజులతో సంబంధం లేకుండా కేవలం నెల రోజులకే బిల్లులు జారీ చేసేలా స్పాట్‌ బిల్లింగ్‌ మెషిన్‌లో తగిన ఏర్పాట్లు చేసామని పేర్కొన్నారు. గృహ వినియోగదారుల విద్యుత్‌ వాడకం బిల్లులకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు టీజీఎస్‌పీడీసీఎల్‌ వెబ్‌సైట్లో ” ఎనర్జీ చార్జెస్‌ క్యాలిక్యులేటర్‌ ఫర్‌ డొమెస్టిక్‌ సర్వీసెస్‌” అనే సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ సమాచారాన్ని మొబైల్‌ యాప్‌లో కూడా చూసుకోవచ్చని వినియోగదారులకు సూచించారు.

Spread the love