బెదిరించొద్దు…

– జేపీఎస్‌ల డిమాండ్లు పరిష్కరించాలి
– సమ్మెను విరమింపజేయాలి : కేవీపీఎస్‌ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జూనియర్‌ పంచాయతి సెక్రటరీ (జేపీఎస్‌)ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి, తక్షణం వారితో సమ్మెను విరమింపజేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టీి స్కైలాబ్‌బాబు బుధవారం నాడొక ప్రకటన విడుదల చేశారు. రెండువారాలుగా జేపీఎస్‌లు చేస్తున్న నిరవధిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రొబెషన్‌ పిరియడ్‌ను దష్టిలో ఉంచుకొని, వారి సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని కోరారు. కేవలం రూ. 15వేలు జీతంతో 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి విధులు నిర్వర్తిస్తున్నా రెగ్యులరైజ్‌ చేయకపోవడం సరికాదన్నారు. మొదట మూడేండ్ల ప్రొబిషన్‌ పిరియడ్‌ అనీ, ఆ తర్వాత మరో ఏడాది పెంచి మొత్తం నాలుగుగేండ్లు పూర్తయినా, క్రమబద్ధీకరణలో తాత్సారం చేయడంలో అర్థం లేదన్నారు. జీతభత్యాలు కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కోరకంగా ఇస్తున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రంలో రెండేండ్ల కాలానికే సెక్రెటరీలను క్రమబద్ధీకరణ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తక్షణం వారిని చర్చలకు పిలిచి, సమస్య పరిష్కరించి, సమ్మె విరమింపచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love