Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళ్లు కాదు.. కాలర్‌ పట్టుకోవాలి

కాళ్లు కాదు.. కాలర్‌ పట్టుకోవాలి

- Advertisement -

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు
మద్దతు ధర ఒట్టి డైలాగ్‌లే.. ధాన్యాన్ని 2వేలకే అమ్ముకునే దుస్థితి :
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
సిరికొండలో రైతు కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు అధికారుల కాళ్లు పట్టుకోకూడదని, కాంగ్రెస్‌ నాయకుల కాలర్‌ పట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రైతులకు సూచించారు. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలో పంట కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్‌ కుటుంబా న్ని కేటీఆర్‌ పరామర్శించారు. ఆ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ తరపున రూ.3లక్షల చెక్కును అంద జేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని, ధైర్యాన్ని కోల్పోయి కుటుంబాలను ఆగం చేయొద్దని కోరారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికీ రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చదువుకునే పిల్లలుంటే ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని, అందువల్ల ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
రైతులకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, వరి ధాన్యం కొనుగోళ్లలో బోనస్‌ ఇస్తామని ఎగనామం పెట్టిందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతుబంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో పంటలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్‌ యార్డుల్లోనే ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను, తనను తిట్టడమే తప్ప ప్రజల సంక్షేమం పట్ల పట్టింపులు లేవని విమర్శించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం కొనుగోలు చేసే కోటా కంటే ఎక్కువ ఒక్క గింజ కూడా కోనుగోలు చేయబోమన్నారని తెలిపారు. అన్ని పంటలకు బోనస్‌ ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటిస్తే.. ఇప్పుడు ఏడు రకాల సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3720 మద్దతు ధర అని డైలాగ్‌లు కొట్టిన సీఎం మార్కెట్‌లో రూ.2వేలకు ప్రయివేట్‌ వ్యాపారులకు అమ్ముకునే దుస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కరోనా కంటే ప్రమాదకరమైనదని, రాబోవు కాలంలో మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వమే వస్తుం దని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, బోథ్‌ నియోజక వర్గ స్థాయిలో శనివారం ‘సర్‌’పై బీఆర్‌ఎస్‌ నిర్వహిం చిన సమావేశంలోనూ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -