Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంన్యాయవాదుల సంక్ష‍ేమానికిరూ. 500 కోట్లు కేటాయించాలి

న్యాయవాదుల సంక్ష‍ేమానికిరూ. 500 కోట్లు కేటాయించాలి

- Advertisement -

2019 తరువాత నమోదైన వారికి హెల్త్‌‌కార్డులివ్వాలి
అడ్వకేట్లను పట్టించుకోండి..
సర్కార్ కు ‘ఐలు’ డిమాండ్‌
60 శాతం మంది వకీళ్లకు
సరైన ఆదాయం లేదు: ఐలు రాష్ట్ర అధ్యక్ష‍ులు కొల్లి సత్యనారాయణ ఆవేదన
సహకరిస్తాం: బార్‌‌కౌన్సిల్‌ సభ్యులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
న్యాయవాదుల సంక్ష‍ేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) డిమాండ్‌ ‌చేసింది. తద్వారా న్యాయవాదులు, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరింది. రాష్ట్రంలో 60 శాతం మంది వకీళ్లకు సరైన ఆదాయం లేదని అభిప్రాయపడింది. 2019 తరువాత నమోదైన అడ్వకేట్లకు హెల్త్‌‌కార్డులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. శనివారం హైదరాబాద్‌‌లోని ఇందిరా పార్క్‌ ‌వద్ద ఐలు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది న్యాయవాదులు ఈ ధర్నాకు హాజరయ్యారు. తమ సమస్యలపై గొంతెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేపట్టారు. దీనికి ‘ఐలు’ రాష్ట్ర అధ్యక్ష‍ులు, సీనియర్‌ ‌బార్‌‌కౌన్సిల్‌ ‌సభ్యులు కొల్లి సత్యనారాయణ అధ్యక్ష‍త వహించగా ఐలు రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.పార్థసారధి నాయకత్వంలో ధర్నా జరిగింది. ఇందులో బార్‌‌కౌన్సిల్‌ సభ్యులు రఘునాథ్‌, శ్రీనివాసరావు, మహేష్‌, శైలజ, అన్నపూర్ణ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో తమ సమస్యలపై న్యాయవాదులు నినాదాలు చేశారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం, రాజ్యాధికారంలో కోర్టులు భాగమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాల నిర్ణయాలు, ఇతరాలను సమీక్ష‍ించే అధికారం కేవలం కోర్టులకే ఉంటుందనీ, అలాంటి వ్యవస్థల్లో పనిచేస్తున్న న్యాయవాదుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్నారు. వకీళ్లు లేకపోతే సాధారణ ప్రజలు, సమాజం తమ హక్కులు పొందలేరని వివరించారు. వ్యవస్థల్లో న్యాయవాదులు ఉద్యోగులు కాదనీ, వారికి సామాజిక బాధ్యత కూడా ఉంటుందన్నారు. ఆర్థికంగా అనేక కష్ట, నష్టాలను అనుభవిస్తూ న్యాయపరిరక్ష‍ణ కోసం నిరంతరం కృషిచేస్తున్నారని గుర్తు చేశారు. మెజారిటీ అడ్వకేట్లకు కనీస ఆదాయం కూడా లేకపోవడం ఆందోళన, ఆవేదనకు గురిస్తున్నదని అన్నారు. ఇప్పటికీ కొంత మంది సైకిళ్లపై కోర్టుకు వస్తున్నారని చెప్పారు. సరైన యూనిఫామ్ కూడా ఉండటం లేదని తెలిపారు. అఖిలభారత న్యాయవాదుల సంఘం(ఐలు) వకీళ్ల సమస్యలపై పోరుబాటన నడుస్తున్నదన్నారు. న్యాయవాదులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డిని అడిగితే తిరస్కరించారని చెప్పారు. హెల్త్‌‌కార్డుల జారీలోనూ అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. కేరళం, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీలో న్యాయవాదుల కోసం ప్రత్యేక పథకాలు అమలవుతున్నాయన్నారు. కేరళంలో కోర్టు ఫీజు స్టాంపుల నుంచి కూడా సంక్ష‍ేమ నిధులు తరచుగా జమఅవుతూనే ఉంటాయని గుర్తు చేశారు. వకీళ్ల సంక్ష‍ేమ నిధికి నిధులు పెంచాలని అడుగుతున్నామని తెలిపారు.తెలంగాణలో న్యాయవాదులకు ఇండ్లస్థలాలు ఇవ్వాలని డి మాండ్‌ ‌చేశారు. సమస్యలపై ఇతర సంఘాలు, ప్రముఖ న్యాయవాదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే న్యాయవాదుల సమస్యలపై బార్‌‌కౌన్సిళ్ల కృషి సరిగ్గాలేదని చెప్పారు. న్యాయసంబంధమైన విద్య, ఇతర అంశాల్లో మరింత చురుకైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని వివరించారు. కొత్త చట్టాలను విశ్లేషించి సమాజానికి, ప్రజలకు అర్థమయ్యేరీతిలో పుస్తకాలను ప్రచురించామని పేర్కొన్నారు. ఇలా దాదాపు 18 చట్టాలపై డాక్యుమెంట్లను విడుచేసినట్టు వివరించారు. కొత్తగా కేంద్రం తెచ్చిన చట్టాలు సాధారణ ప్రజలకు, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తు చేశారు. బార్‌‌కౌన్సిల్‌ ‌సభ్యులు ఎం. శ్రీనివాస రావు, సిహెచ్. శైలజ, కె. సుజాత పాశం, అశోక్ గౌడ్ పొన్నం, వి. రఘునాథ్, కిరణ్ కుమార్ జి., అనిల్ కుమార్ ,మహేష్ గౌడ్ అకుల హాజరై మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదుల సంఖ్య పెరిగినరీత్యా సంక్ష‍ేమ నిధికి రేవంత్‌‌రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ‘ఐలు’ ఈ దిశగా పోరాటం చేయడం పట్ల అభినందించారు. ఈ ఉద్యమాలు, పోరాటాలకు సహకరిస్తామని హామీనిచ్చారు. సమస్యలపై ముఖ్యమంత్రిని కలవాలని సూచించారు. అమసరమైతే మళ్లీ, మళ్లీ ధర్నాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐలు సెక్రటేరియట్ సభ్యులు సి. రామచందర్ రెడ్డి, రమేష్ కుమార్ మెక్కాడ్, వై. శ్రీనివాస రావు, అన్నపూర్ణ , మహిళా కో-కన్వీనర్ రామలక్ష్మి కూడా పాల్గొన్నారు. ఐలు విద్యార్థుల కమిటీ కన్వీనర్ అలీ హైదర్‌, క్రాంతి, మహ్మద్ అమైర్ , అలీ జాన్‌తో కలిసి, ఈ కార్యక్రమం కోసం న్యాయవాద విద్యార్థులు, యువ న్యాయవాదులను సమీకరించడంలో చురుకుగా పాల్గొన్నారు.
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డితో పాటు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పలు బార్ అసోసియేషన్ల అధ్యక్ష‍, కార్యదర్శులు ఈ ధర్నాలో పాల్గొని, ఐలు లేవనెత్తిన డిమాండ్లకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
డిమాండ్లు
నమోదైన న్యాయవాదులందరికీ ఆరోగ్య కార్డులు అందించాలి.
మరణించిన న్యాయవాదుల పేర్లను తొలగించడం, కొత్తగా నమోదైన వారి పేర్లను చేర్చడం ద్వారా న్యాయవాదుల జాబితాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి.
వైద్య బీమా పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలి. కుటుంబ సభ్యులను కూడా ఇందులో చేర్చాలి.
అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్స వర్తించేలా చూడాలి ,ఎంపానెల్డ్ (గుర్తింపు పొందిన) ఆసుపత్రుల సంఖ్యను పెంచాలి.
న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు అదనంగా రూ. 500 కోట్లు కేటాయించాలి.
న్యాయవాదుల సంక్షేమం కోసం బార్ కౌన్సిల్‌కు ప్రతి ఏటా రూ. 10 కోట్లు కేటాయించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -