Sunday, June 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

- Advertisement -

బాధితులకు చట్టం ప్రకారం సత్వర న్యాయం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య
హన్మకొండ కలెక్టరేట్‌లో సమీక్ష
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు సంబంధించిన పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. హన్మకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవితతో కలిసి శనివారం భూ సమస్యలు, హక్కుల పరిరక్షణ, అట్రాసిటీ కేసుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ విధానం, బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల నమోదు నుంచి దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు వరకు ప్రతి దశలోనూ వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలా చివరి శనివారం నిర్వహించే పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో తహసీల్దార్లు, పోలీసు అధికారులు తప్పనిసరిగా పాల్గొని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, స్వయం ఉపాధి పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని కమిషన్‌ చైర్మెన్‌ అన్నారు. బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోమారు విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన తప్పనిసరిగా నిర్వహించి సమస్యల పరిష్కార పురోగతిని సమీక్షించాలన్నారు.
ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తాం :కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయి
గోపాల్‌పూర్‌ ఊర చెరువు పరివాహక ప్రాంతాల్లో ముంపు సమస్య ఏర్పడిన నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ ద్వారా అవసరమైన చర్యలు చేపట్టామని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయి తెలిపారు. చెరువులో వున్న సమాధుల కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి కేటాయిస్తామన్నారు. భద్రకాళి ఆలయ పరిసరాల అభివృద్ధి కోసం అనేక సంవత్సరాలుగా ప్రతిపాదనలున్నాయని, కాలనీవాసులను బలవంతం చేయడం లేదని చెప్పారు. ముందుకొచ్చిన కుటుంబాలకు న్యూశాయంపేటలో రెండు పడక గదుల గృహాలను కేటాయి స్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా చెరబండరాజు కాలనీకి చెందిన అర్హులైన కుటుంబాలకు న్యూశాయంపేటలో ఇండ్ల కేటాయింపు పత్రాలను కమిషన్‌ చైర్మెన్‌ చేతుల మీదుగా అందించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఎన్‌.రవి, ట్రైనీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రోహిత్‌, హన్మకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్‌, డీఎస్‌ వెంకన్న, పరకాల మున్సిపల్‌ కమిషనర్‌ పోతరాజు పవన్‌, ఏసీపీలు ప్రశాంత్‌రెడ్డి, నర్సింహారావు, సతీష్‌బాబు, ఎస్సీ, ఎస్టీ విజి లెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ మెంబర్స్‌ పల్లెపాడు దామోదర్‌, రడపాక పరంజ్యోతి, చుంచు రాజేందర్‌, పుట్ట రవి, సింగారపు రవిప్రసాద్‌ పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ను కలిసిన ‘రడపాక’
వడ్డేపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్‌ 774, 776లోని 5.10 ఎకరాల్లో దళితులకు పట్టాలిప్పించాలని విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు రడపాక పరంజ్యోతి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. వడ్డేపల్లి దళితులు పసునూరి రూప, పసునూరి కోటి, ఇల్లందుల రమేష్‌, అనిల్‌, సునీల్‌తో కలిసి చైర్మెన్‌ను కలిశారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -