ఆందోళన వద్దు..

Don't worry..– అవగాహన పెంచుకోండి
– సీజనల్‌ వ్యాధుల నివారణకు జాగ్రత్తలే ప్రధానం
– రిస్క్‌ గ్రూప్‌ అప్రమత్తంగా ఉండాలి
– నవతెలంగాణ ఇంటర్వ్యూలో హైదరాబాద్‌  ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, విరేచనాలు, నీరసం, వాంతులు వంటి లక్షణాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీటి నిల్వలు పేరుకుపోవడం, నీటి కాలుష్యంతో వచ్చే వ్యాధులు, అపరిశుభ్రత కారణంగా దోమకాటుతో వచ్చే వ్యాధులు, ఆహార కాలుష్యంతో తలెత్తే సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోగుల ఆందోళనలతో కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రులు లెక్కకు మించి రోగ నిర్దారణ పరీక్షలకు సిఫారసు చేసిన తర్వాతే చికిత్స అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందులకు తోడు, మరోవైపు ఆనారోగ్యంపాలై రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి బారిన పడిన వారు ఏం చేయాలి?, ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్న చికిత్సలపై తదితరాంశాలను హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ విశదీకరించారు. నవతెలంగాణకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు….
అకాల వర్షాలు కురిశాయి. మరోవైపు వానాకాలం కూడా సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశముంది. అవి రాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
వర్షాకాలంలో నీటిసంబంధిత వ్యాధులతో పాటు ఆహార కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు ప్రబలే అవకాశముంది. ముఖ్యంగా డయేరియా, టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, జాండీస్‌ (కామెర్లు), డిప్తీరియా, చికెన్‌ పాక్స్‌ (అమ్మతల్లి), మీజిల్స్‌ (తట్టు), టెటనస్‌ (ధనుర్వాతం) మమ్స్‌ (దవడ బిళ్లలు) తదితర వ్యాధులు ప్రబలే అవకాశముంది. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటిని నిల్వ ఉంచడం, దోమలు పెరిగేందుకు ఆస్కారమిచ్చేలా అపరిశుభ్ర వాతావరణంతో పాటు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో వైరల్‌, బాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతుంటాయి. వర్షంలో తడిస్తే దగ్గు, జలుబు, గొంతునొప్పి, నీరసం సాధారణంగా వస్తుంటాయి. ఇవి రాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వేడి ఆహారాన్ని మాత్రమే భుజించడం, నీరు నిల్వలేకుండా చూసుకోవడం, డెంగ్యూ ప్రబలకుండా దోమల ఉత్పత్తి జరగకుండా పాత సామానుల ను తీసేయడం ఉంచుకోవడం వంటివి చేయాలి.
ఈ వ్యాధులపరంగా రిస్క్‌ ఎక్కువ ఉన్న వారెవరు?
చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పాటు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆయా వ్యాధుల బారిన వీరు ఎక్కువగా పడే అవకాశముంది. ఇలాంటి వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షంలో తడవకూడదు. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు ఉపయోగించాలి. ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం.
సీజనల్‌ వ్యాధుల లక్షణాలు కనిపిస్తే ఏమి చేయాలి?
సీజనల్‌ వ్యాధులకు ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి సారి ఈ వానాకాలంలో వచ్చే వ్యాధులే అవి. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి వస్తే మూడు రోజుల్లో తగ్గిపోతాయి. అప్పటికీ తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచింది. సాధారణ డెంగ్యూ వస్తే ఆందోళన చెందాల్సిన పని లేదు. డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌ (తీవ్రమైన దశ)కు చేరితే అది ప్రాణాంతంగా మారే ప్రమాదముంది. ఆ పరిస్థితిలో ప్లేట్‌ లెట్స్‌ తగ్గుతుంటాయి. ఆరోగ్యవంతునిలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు అవి ఉంటాయి. వాటి సంఖ్య లక్షలోపునకు తగ్గితే వెంటనే జాగ్రత్త పడాలి. అయితే వాటి సంఖ్య మరీ తగ్గి 20 వేల లోపుకు పడిపోతే ప్లేట్‌ లెట్స్‌ ఎక్కించుకోవాల్సి ఉంటుంది.
కుక్కకాటు, ఇతర జంతువులు
గాయపరిచిన సందర్భాల్లో ఏం చేయాలి?
సాధారణంగా వేసవిలో ఎక్కువగా ఉండే కుక్కకాటు కేసులు వర్షాకాలంలో తక్కువగా ఉంటాయి. అయితే కుక్కకాటు, కోతులు కరవడం, పిల్లలు గీరడం, ఇతర జంతువులచేత గాయాలపాలైతే తప్పనిసరిగా దానికి తగిన చికిత్స చేసుకోవాలి. ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు రేబీస్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా పలువురు చనిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కుక్కకాటుకు ఫీవర్‌ ఆస్పత్రిలో ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తున్నాం. ఇతర జంతువుల చేత గాయాలైనా ముందుగా వేసుకునే ఈ వ్యాక్సిన్‌ ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్‌ ను 5 దశల్లో వేస్తున్నాం. సాధారణంగా రేబీస్‌ వచ్చిన వారిలో ధ్వని, వాయు, నీటి ఫోబియా లక్షణాలుంటాయి.
ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలతో పాటు, కొత్తగా అందుబాటులోకి ఏమైనా సౌకర్యాలు రానున్నాయా?
ప్రస్తుతం ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు అవుట్‌ పేషెంట్లు వస్తున్నారు. వారిలో దాదాపు 50 శాతం మందికి టెస్టులు అవసరం పడుతున్నాయి. వారికి పరీక్షలు చేసేందుకు అవసరమైన ల్యాబ్‌ సౌకర్యంతో పాటు అవసరమైనంత మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అందులో వైరాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు.
రేబీస్‌కు బీబీనగర్‌ ఎయిమ్స్‌తో పాటు ఫీవర్‌ ఆస్పత్రిలో రోగ నిర్దారణ పరీక్షలను చేస్తున్నాం. ఇటీవల నేషనల్‌ రేబీస్‌ ఎరాడికేషన్‌ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం ఫీవర్‌ ఆస్పత్రిలో డయాగస్టిక్‌ సేవలను గుర్తించింది. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను పంపించాం. కొత్త అవుట్‌ పేషెంట్‌ బ్లాక్‌ అందుబాటులోకి రానుంది.

Spread the love