బహుముఖ ప్రజ్ఞాశాలి దోరవేటి

బహుముఖ ప్రజ్ఞాశాలి దోరవేటిఆయన కలం పడితే రచనలు వెల్లువలా వస్తాయి. ఆయన గళమెత్తితే గాంధర్వం ప్రతిఫలిస్తుంది. ఆయన కాలికి గజ్జె కడితే అంగికాభినయాలు తోడై నిలుస్తాయి. ఆయన చిత్రం గీస్తే  సజీవ కళతో మనతో మాట్లాడతాయి. సంగీత వాయిద్య కళాకారునిగా సరిగమలు పలికించగలడు. బుర్రకథలు హరికథలను వీనుల విందుగా వినిపించ గలడు. మూర్తీభవించిన  మానవత్వం, ఆలోచింపజేసే సాహిత్యం ఆయన సొంతం. ఆయనే బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆదర్శ భాషోపాధ్యాయుడు దోరవేటి.
సాధారణంగా ఒక వ్యక్తిలో మూడు నాలుగు ప్రతిభా విశేషాలు ఉంటాయి. కానీ దోరవేటి చెన్నయ్యలో సజన, నటన, విమర్శ, నాట్యం, గానం, సంగీతం, చిత్రలేఖనం, అవధానం వంటి విశేష ప్రతిభలు బహుముఖీనంగా కనిపిస్తాయి. దాదాపు రెండు పదుల వైవిధ్య కళలు ఆయనలో ఉన్నాయి. 8వ తరగతిలోనే 200 పేజీల నవల (గజదొంగ గంగన్న) రచన చేసిన వీరిని చూస్తే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే లోకోక్తి గుర్తుకు వస్తుంది.
దోరవేటి ఉప్పరి అడివయ్య, ఈశ్వరమ్మ దంపతులకు 1961 ఫిబ్రవరి 11న రంగారెడ్డి జిల్లా ధారూర్‌లో జన్మించారు. నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్నప్పటికీ విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి అడివయ్య జానపద కళాకారుడు కావడం వలన పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ కళారూపాలలో పురాణేతిహాసాలను ఆసక్తిగా గమనించి ఆకళింపు చేసుకున్నారు. ఆ ప్రభావమే ఆయనను సాహిత్య, కళారంగాల వైపు ఆకర్షింపజేసిందని చెప్పొచ్చు. స్నేహితుల సహకారంతో అనేక ఇబ్బందులను అధిగమించి ఉన్నత విద్యను పూర్తి చేశారు. చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రారంభించి, పదోన్నతి పొంది, దాదాపు నాలుగు దశాబ్దాలు విద్యారంగానికి సేవలందించారు.
వీరు సుమారు 45 కు పైగా గ్రంథాలు రాశారు. వీటిలో శతకాలు, ఖండకావ్యాలు, గేయ సంపుటాలు, వచన కావ్యాలు, నవలలు, కథా సంపుటాలు, వ్యాస సమీక్షలు ఉన్నాయి. 250 కి పైగా కథలు రాసి ఆబాల గోపాల హదయాలను చూరగొన్నారు. అయితే
”పద్యము ప్రాణము జిహ్వకు/ పద్యమె నా తెలుగుజాతి ప్రజ్ఞాయశముల్‌/ పద్యమె బాయని సంపద/ పద్య కవిత హద్వికాస పథమగు నేస్తమ్‌” అంటూ తన నేస్తం శతకంలో పద్యం విశిష్టతను, దాని పట్ల తనకున్న మమకారాన్ని చెప్పుకోవడం విశేషం. మరొకచోట ఒక ఖండ కావ్యంలో ”కన్నది మాతభూమి కలగన్నది ధర్మ పతాకవీచు ల/ త్యున్నత పౌరుషాత్ముల మహోజ్వల కాంతుల హారతుల్‌ సుసం/ పన్న యశో విలాసముల భవ్య గుణార్జిత నిత్య సాధ నా/ పన్న సురక్ష దీక్ష గలవారల భారత వీర పుత్రుడా!” అని దోరవేటి దేశం పట్ల జాతి పట్ల తన గౌరవభావాన్ని చాటుకున్నారు. మానవత, జాతీయత, సామాజికత, సాంస్కతికత అంతర్వాహినిగా సాగిన వీరి రచనలన్నీ పఠనీయ గ్రంథాలే.
దోరవేటి అవధాని కూడా. అష్టావధానాలు, గేయావధానాలు చేశారు. ఆశువుగా గేయం చెప్పడం, దత్తపదులతో పాటలల్లడం మొదలగు వాటిలో సిద్ధహస్తులు. దూరదర్శన్‌లో పద్యాల తోరణం, స్మైల్‌ రాజా స్మైల్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డాక్టర్‌ మలుగా అంజయ్యతో కలిసి అవధానాలు చేశారు. నత్య ప్రదర్శనలు రూపొందించారు. అనేక నాటకాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా పాఠ్యపుస్తకాల రచనలో రచయితగా, చిత్రకారుడుగా సేవలందించారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో విద్యార్థులకు పాఠాలు, ధారావాహికలు వంటి ప్రక్రియల్లో కూడా పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఇటీవల సినీ రంగంలో కూడా అడుగు పెట్టారు. ‘బ్రహ్మచారి, శివ శంభో’ సినిమాలకు మాటలు, పాటలు, సంగీతం సమకూర్చడంతో పాటు నటుడిగా కూడా అరంగేట్రం చేశారు. అవి ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి. ”పద్యం ఆయన తోటలో గాలికి తలలూపే పూలవాద్యం” అని డాక్టర్‌ ఎన్‌.గోపి, ”సాటివారి పొగడ్తల కెల్ల మించినట్టి సరికొత్త ‘రసా’మాన్యుడు” అని వేణు సంకోజు వీరిని ప్రశంసించారు. అందుకేనేమో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం, నోముల కథా పురస్కారం, పాల్కురికి సోమనాథ సాహిత్య పురస్కారం, సాహిత్య కళారత్న, అభినవ దాశరధి అన్న బిరుదులు వీరిని వరించాయి. దోరవేటి ఎలాంటి భేషజాలకు తావివ్వని ఉపాధ్యాయులు. సౌజన్యమూర్తి. సాహిత్య స్ఫూర్తి. బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు రాసిన గ్రంథాలు సామాజిక పురోగతికి, విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకంగా నిలుస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అవధాని అవుసుల భాను ప్రకాష్‌ అన్నట్లు ”చెన్నయ దోరవేటి పద చిత్రపు కాంతుల వాటి! ధారలో/ నన్నయ బోటి! లేఖినిన నవ్యత జిల్కెడి మేటి! గాత్రమా/ క్రొన్నల తేటి! యందరికి కూర్మిని పంచెడి పేటి! యన్నయౌ/ చెన్నయ కేరిసాటి? ధర చెల్వగు వందన మందుకొమ్మికన్‌”
‘దోరవేటి సమగ్ర సాహిత్యం- ఒక అధ్యయనం’ అనే అంశంపై నల్లగొండకు చెందిన పరిశోధకుడు సాగర్ల సత్తయ్య కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి పరిశోధన పూర్తి చేయడం గమనార్హం. ఈ పరిశోధన ద్వారా దోరవేటి సమగ్ర సాహితీ మూర్తిమత్వం ఆవిష్కరించబడింది. ఈ సిద్ధాంత గ్రంథంలో దోరవేటి సామాజిక నవలల్లో వాస్తవికతను వివరించారు. కథల్లోని కుటుంబ సాంస్కతిక విలువలు, దేశభక్తి, చారిత్రక దక్పథాన్ని తెలియజేశారు. పద్య సాహిత్యంలో సామాజిక విలువలను ఆవిష్కరిస్తూ పద్యం ఔన్నత్యాన్ని నిరూపించారు. దోరవేటి గేయాలు, కీర్తనల్లో పర్యావరణ స్పహను వెలికి తీశారు. వ్యాసాలలోని వస్తు వైవిధ్యాన్ని సమకాలీనతను తెలియజేశారు. వీరు ‘శరణు బసవ, శ్రీ కాశీఖండం, ప్రభులింగ విభూతి’ కావ్యాలను సమగ్ర పరిశీలన చేశారు. ఈ పరిశోధన ముందు తరాల వారికి ఎంతో ఉపయుక్తమైనది. ఉత్తరోత్తరా దోరవేటి కలం నుండి మరిన్ని కావ్యాలు జాలువారి తెలుగు సాహిత్యం సుసంపన్నం అవుతుందనడం అత్యాశ కాదేమో!
– డా||చింతోజు మల్లికార్జునచారి
91822 89081

Spread the love