మార్గ దర్శి

మార్గ దర్శి”నాన్నా, మీ స్నేహితుడు దుర్గయ్య అంకుల్‌ కథారచయిత కదా, ఆ అంకుల్‌ బంధువుల పెళ్లి కోసం రేపు మన ఊరు వస్తున్నట్టు చెప్పారు. ఒకసారి మన ఇంటికి తీసుకొస్తారా” తొమ్మిదవ తరగతి చదువుతున్న నా కూతురు సృజన అడిగింది.
”ఎందుకు” అడిగాను.
”ఆ అంకుల్‌ దగ్గర కథలు ఎలా రాయాలో అడిగి తెలుసుకొంటాను” అంది సృజన.
”చూడమ్మా, కథలు కాకరకాయలు అంటూ సమయం వృథాచేయవద్దు. చదువుపైన శ్రద్ద వహించు. ఇప్పుడు చదువులో అరవై నుంచి డెభై శాతం మార్కులు మాత్రమే తెచ్చుకొంటున్నావు. ఆ మార్కులు సరిపోవు. చదువు పూర్తయ్యాక ఎన్ని కథలైనా రాయి” అన్నాను
”ముందు నీ చదువులగురించి ఆలోచించు. తరువాత కథలు చూడు. నీకంతగా తీరిక ఉంటే నాకు వంట పనుల్లో సాయం చేయి” అంది నా భార్య.
”అమ్మా…! నువ్వు చెప్పిన పనులు ఎప్పుడైనా చేయకుండా వున్నానా?” అలిగి అక్కడి నుండి వెళ్లిపోయింది సృజన.
కొన్ని నెలలు గడిచాయి.
ఆ రోజు ఆఫీసులో వున్నప్పుడు సెల్‌ ఫోను రింగ్‌ కాగానే తీసుకొన్నాను.
”హలో బాగున్నావా రా? ఇప్పుడు ఎక్కడ వున్నావు” అంటూ దుర్గయ్య ఫోనులో అడిగాడు.
” ఆఫీసులో వున్నాను దుర్గయ్యా” అన్నాను
”ఒరేరు, మొదట నీకు కంగ్రాట్స్‌ చెప్పాలి. ఈ మధ్య బాల రచయితల వెనుక ఎక్కువగా బడి మాష్టారులు మార్గదర్శిగా వుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కువగా ప్రోత్సహించడం లేదు. నీవు మీ అమ్మాయి సృజన రచయిత కావడానికి నీవే మార్గదర్శి అనుకొంటున్నాను. బాలల కథల పోటీలో మీ అమ్మాయికి రెండవ బహుమతి వచ్చింది” అన్నాడు
”సారీ దుర్గయ్యా , ఆరునెలల క్రితం రచనల విషయమై మా సృజన నిన్ను అడగాలనుకొంది. నేనే వ్యతిరేకించాను ఆ తరువాత సృజన నా దగ్గర రచనల గురించి మాట్లాడ లేదు. నీవు మీ బడిలో బాలల రచయితలను ప్రోత్సహిస్తూ మార్గదర్శి అయినట్లు, ఇక్కడ బడిలో మాస్టారు ఎవరో మా సృజనకు మార్గదర్శిగా ప్రోత్సహించారు. ఇప్పుడే వెళ్లి ఆ మాస్టారు ఎవరో తెలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకొంటాను” సంతోషంతో అన్నాను.
– ఓట్ర ప్రకాష్‌ రావు, 09787446026 

Spread the love