– సీఎం రేవంత్‌రెడ్డికి జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేసి నల్లగొండ జిల్లాలోని పరివాహక ప్రాంత గ్రామాలకు తాగు నీరు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి ప్రారంభమైందని పేర్కొన్నారు. చెరువులు పూర్తిగా ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. మంచి బోర్లు ఎండిపోయి తాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీరు కూడా గ్రామాలకు రావడం లేదని తెలిపారు. ఇటీవల సాగర్ నుంచి ఖమ్మం జిల్లా, పాలేరు ప్రాజెక్టుకు ముందు జాగ్రత్తగా నీరు విదుడల చేశారనీ, నల్లగొండ జిల్లా, సాగర్ ఆయకట్టు పరిధిలోని గ్రామాల్లోని చెరువులకు కూడా నీరు విడుదల చేసి నింపినట్లయితే ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల లభ్యత పెరుగుతుందని తెలిపారు. దీంతో చేతి పంపు బోర్ల ద్వారా తాగు నీటి సౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు రూ. కోటి విడుదల చేసినా, బోర్లు ఎండిపోయినందున అట్టి నిధులను పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉండదని పేర్కొన్నారు. నిండు వేసవిలో పరిస్థితి మరింత తీవ్రత ఏర్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి పరివాహక ప్రాంతంలోని చెరువులను నింపాలనీ, తద్వారా భూగర్భ జలాల నీటి లభ్యతతో చేతి పంపు బోర్ల ద్వారా ప్రజలకు తాగు నీటి సౌకర్యం కల్పించాలని లేఖ ద్వారా సీఎంకు విజ్ఞప్తి చేశారు.