నగరంలో డ్రగ్స్‌ పట్టివేత

నగరంలో డ్రగ్స్‌ పట్టివేత– వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు
– నైజీరియన్‌తోపాటు మరో వ్యక్తి అరెస్ట్‌
– 43 ఎల్‌ఎస్‌డీ, 16 గ్రాముల కొకైన్‌ స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌తోపాటు మరో వ్యక్తిని హైదరాబాద్‌ నార్కొటెక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్‌ నుంచి 16 గ్రాముల కొకైన్‌, భువనగిరికి చెందిన మరో వ్యక్తి నుంచి 43ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రష్మి పెరుమాళ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఒకారో కాస్మోస్‌ రామ్సే వ్యాపారం కోసం వీసాపై 2014లో న్యూఢిల్లీకి వచ్చాడు. తమిళనాడు, తిరుపూర్‌ తదితర ప్రాంతాల్లో బట్టల వ్యాపారం పేరుతో పలువురిని కలిశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి నివాసముంటున్నాడు. 2016లో నైజీరియన్‌ దేశానికి చెందిన మరో వ్యక్తితో కలిసి కొకైన్‌ సరఫరా చేయడంతో గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు బెంగళూర్‌, హైదరాబాద్‌ తదితర పట్టణాల్లో కొకైన్‌ సరఫరా చేశాడు. 2018లో ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కి మళ్లీ జైలుకెళ్లాడు. తిరిగి జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు మళ్లీ కొకైన్‌ సరఫరా చేయడం మొదలుపెట్టాడు. తాజాగా సమాచారం అందుకున్న నార్కొటెక్‌ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.నాలుగు లక్షల విలువగల 16గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బీటెక్‌ మధ్యలోనే వదిలేసి డ్రగ్స్‌కు బానిసగా..
భువనగిరికి చెందిన వి.లక్ష్మీపతి అలియాస్‌ లక్కీ బీటెక్‌ను మధ్యలోనే వదిలేశాడు. జల్సాలకు అలవాటైన అతను గంజాయి, మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో అరకు నుంచి గంజాయి, గోవా, ముంబయి నుంచి డ్రగ్స్‌ను తక్కువ ధరకు తీసుకొచ్చేవాడు.ఎల్‌ఎస్‌డీని మాత్రం కొరియర్‌ ద్వారా తెప్పించేవాడు. కావాల్సిన వారికి, స్నేహితులకు అధిక ధరలకు డ్రగ్స్‌, గంజాయిని సరఫరా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న హైదరాబాద్‌ నార్కొటెక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పోలీసులు లక్కీని అరెస్టు చేశారు. అతని నుంచి 43గ్రాముల బ్లాట్స్‌తోపాటు కార్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.11,50,000 ఉంటుందని డీసీపీ తెలిపారు.

Spread the love