ఆర్టీసీకి దసరా ఆదాయం రూ.25 కోట్లు

RTC's Dussehra revenue is Rs.25 croresనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దసరా పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీకి దాదాపు రూ.25 కోట్ల అదనపు ఆదాయం సమకూరినట్టు అధికారులు లెక్కలు కట్టారు. అయితే డిపోల నుంచి మరింత సమాచారం వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందని చెప్తున్నారు. అక్టోబర్‌ 13 నుంచి 24వ తేదీ వరకు 11 రోజులపాటు ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులను నడిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,302 ప్రత్యేక బస్సుల్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ట్రలకు ప్రత్యేక బస్సుల్ని నడిపారు. గతంలో దసరా సందర్భంగా సాధారణ చార్జీలతో పాటు మరో 50 శాతం టిక్కెట్‌ చార్జీగా వసూలు చేసేవారు. అయితే ఈసారి సాధారణ చార్జీలంటూనే డైనమిక్‌ చార్జీల పేరుతో వసూళ్లు చేశారు. ప్రయాణికులు తక్కువ ఉన్న సమయంలో తక్కువ ఛార్జీలు, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ వసూలు చేశారు. అయితే ప్రయివేటు ట్రావెల్స్‌తో పోలిస్తే డైనమిక్‌ ఛార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గుచూపినట్లు అధికారులు తెలిపారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం పది రీజియన్లలో ఒక్కో రీజియన్‌కు రూ.2.50 కోట్ల వరకు ఆదాయం అదనంగా సమకూరినట్టు భావిస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రానికి ఈ లెక్కల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Spread the love