కేంద్రం విభజన హామీలను పరిష్కరించాలి : డీవైఎఫ్‌ఐ

కేంద్రం విభజన హామీలను పరిష్కరించాలి : డీవైఎఫ్‌ఐనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ రెండు దఫాలుగా అధికారంలో ఉన్నా తెలంగాణను పూర్తిగా విస్మరించిందని తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, మెడికల్‌ కాలేజీలు, ఐఐటీ, ఐఐఎం, త్రిపుల్‌ఐటీ, మైనింగ్‌ వర్సిటీలనూ ఇప్పటి వరకు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. మూడో సారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం వందరోజుల కార్యాచరణలో భాగంగా విభజన హామీలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు, ఎంపీలు ఆ బాధ్యత తీసుకోవాలని కోరారు. దేశాభివృద్ధికి కృషి చేయాలనీ, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనీ, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. నీట్‌ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ నిర్వహించిన తీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు న్నాయని పేర్కొన్నారు. ఎన్టీఏ పారదర్శకత, పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలో సమగ్ర న్యాయ విచారణ జరపాలనీ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love