– క్షతగాత్రులు మరో 3400 మంది
– 30 మంది ఆచూకీ లేదు : మయన్మార్ ప్రభుత్వం
– మయన్మార్, బ్యాంకాక్‌లలో కొనసాగుతున్న సహాయక చర్యలు
– భారత్ సహా పలు దేశాల నుంచి సాయం
– మరణించినవారిలో భారతీయులెవరూ లేరు : కేంద్రం
నెపిడా, బ్యాంకాక్ : మయన్మార్, థాయిలాండ్‌లలో శుక్రవారం సంభవించిన భూవిలయంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటివరకు 1600మందికి పైగా మరణించారని మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, 118మంది సిబ్బందితో ఆగ్రా నుంచి ఫీల్డ్ ఆస్పత్రిని మయన్మార్‌కు భారత్ పంపించింది. ఆయా ప్రాంతాల్లో మరణించిన వారిలో భారతీయులెవరూ లేరని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మయన్మార్‌లో మరో 3,400 మంది గాయపడ్డారనీ, 30మంది ఆచూకీ తెలియలేదని అక్కడి ప్రభుత్వం తెలిపింది. సమయం గడుస్తున్న కొద్దీ శిథిలాల నుంచి మృతదేహాలు బయటపడుతున్నాయనీ, సమాచారం సేకరిస్తున్నారనీ, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ప్రభుత్వం వివరించింది. మయన్మార్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంతో అత్యవసర సర్వీసులు తీవ్రంగా బలహీనమయ్యాయి. దీంతో శక్తివంతమైన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో ప్రభుత్వం పలు ఇబ్బందులు పడుతోంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 10మంది మరణించారు. 26మంది గాయపడ్డారు. బ్యాంకాక్‌లోని చటుచక్ మార్కెట్‌కు సమీపంలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కూలిన ఘటనలో దాదాపు వందమంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారని తెలుస్తోంది. భారీ భూకంపంతో భవనాలు నేలమట్టమైన పరిస్థితుల్లో తమ వారి కోసం కేవలం చేతులతోనే ఆ శిధిలాలను, రాళ్లగుట్టలను తవ్వేందుకు ప్రయత్నించడం కనిపిస్తోంది. సాయం కోసం కేకలు వేస్తున్న వారిని బయటకు లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మయన్మార్‌లో శనివారం కూడా ప్రకంపనలు ఎక్కువగానే కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటిల్లో ఒకదాని తీవ్రత 6.4గా నమోదైంది. మాండలె నగరంలో డజన్ల సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో ఆ శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి తమకు సాయం కావాలని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. మయన్మార్ సాంస్కృతిక రాజధాని అయిన మాండలేలో ఒక భవనం కూలిన ఘటనలో 90మందికి పైగా శిథిలాల్లో చిక్కుకుపోయారు.
12 అంతస్తుల ఈ భవనం భూకంపం ధాటికి ఆరు అంతస్తులుగా మిగిలింది. రక్తం కోసం డిమాండ్ బాగా ఉన్నదనీ, రక్త దాతలు ఉదారంగా ముందుకు రావాలని ప్రభుత్వం కోరింది. విదేశీ సాయం తీసుకోవడానికి తాము సిద్ధంగా వున్నామని మిన్ ఆంగ్ ప్రకటించారు. ఇంకా జరిగిన నష్టం, మరణాలపై ఒక స్పష్టత రావాల్సి వుందని ఎన్‌జిఓ ప్లాన్ ఇంటర్నేషనల్‌కు సంబంధించి మయన్మార్ డైరెక్టర్ హైదర్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఇంతటి విధ్వంసాన్ని తాము చూడలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవతా సాయం చాలా ముఖ్యమని అన్నారు.