ప్రయివేటు విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

– కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శీను
నవతెలంగాణ – హాలియా 
నేటి సమాజంలో విద్య వ్యాపారంగా మారిపోయిందని, కేజీల లెక్కన విద్యను అమ్ముకుంటున్నారని, ప్రయివేటు విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అన్నారు. శనివారం హాలియాలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాన్యులకు విద్య అందని ద్రాక్షగా మారిందని, నాణ్యమైన విద్య పేరిట ప్రయివేటు పాఠశాలలు విచ్చల విడిగా దందా ప్రారంభించారని వారన్నారు. పేద మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రులు వారి సంపాదన పాఠశాల ఫీజుల కు సరిపోవటం లేదని వారన్నారు. ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలు ప్రయివేటు పాఠశాలలకు వివిధ రకాల పేర్లు పెట్టి, రంగురంగుల కరపత్రాలు, హోర్డింగులు, బోర్డులు, ప్లెక్సీలతో విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తూ పేద ప్రజలను ఆకట్టుకుంటున్నారని, విద్యతోపాటు, పాఠశాలలో ఫీజులు, బట్టలు, బూట్లు, టై,బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్ ల పేరిట అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. వీటితోపాటు వ్యాన్ ఫీజు ఇతర రకాల ఫీజులతో ప్రారంభంలో మాయమాటలు చెప్పి తర్వాత, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పాఠశాలలో అర్హత లేని ఉపాధ్యాయులతో నిర్వహిస్తూ కార్పొరేట్ స్థాయిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. విద్యా వ్యాపారం చేస్తున్న ప్రయివేటు పాఠశాలలపై మండల విద్యాధికారులు ప్రయివేటు పాఠశాలలు ఇచ్చే మామూళ్ల మత్తులో చూసి చూడనట్టు వ్యవరిస్తున్నారని వారన్నారు. అన్నీ కలిపి ప్రయివేటు పాఠశాలల్లో ఎల్కేజీ విద్యార్థులకు రూ.30 వేల నుండి రూ.40 వేల పై గా సామాన్య ప్రజలు ఫీజులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. పాఠశాలలో ఎక్కడ మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నప్పటికీ పట్టించుకున్న వారే లేరని, ప్రభుత్వం ఒకే ఫీజు విధానాన్ని తీసుకురావాలని, అధిక ఫీజుల దందాలు అరికట్టాలని, అనుమతులు లేని పాఠశాలలపై, అర్హత లేని ఉపాధ్యాయులతో నిర్వహించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య ప్రైవేటీకరుణకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగార్జున, దొరేపల్లి మల్లయ్య,మేకల వెంకన్న. జీవన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love