నీట్‌ లీకేజీ పెద్ద స్కామ్‌

NEET Leakage is a big scam– రూ.30 లక్షల చొప్పున పేపర్‌ అమ్మకం
– సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
– పరీక్షను మళ్లీ నిర్వహించాలి
– మోడీ పాలనలో విద్యా,వైద్యంతో పాటు అన్ని వ్యవస్థలూ ధ్వంసం
– విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త పోరాటాలు : ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీ.పీ. సాను
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్లీనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ పెద్ద స్కామ్‌ అనీ, ఒక్కో అభ్యర్థికి రూ.30 లక్షల చొప్పున పేపర్‌ను అమ్ముకున్నారనే వార్తలొస్తున్నాయని స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత అధ్యక్షులు వి.పి.సాను విమర్శించారు. దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరారు. 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం దక్కే వరకూ ఎస్‌ఎఫ్‌ఐ పోరాడుతుందని నొక్కి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌ లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనం జరిగింది. దీనికి ప్రారంభ సూచికగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎల్‌.మూర్తి ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్లీనానికి ముఖ్యతిథిగా విచ్చేసిన సాను మాట్లాడారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)లోని కొందరు అధికారుల వల్ల పరీక్షకు ముందే పేపర్‌ బయటకొచ్చిందనీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకేజీ జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు బయట పడుతున్నాయని తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఓ విద్యార్థి కేవలం 35 శాతం మార్కులతో ఇంటర్‌ పాస్‌ కాగా, నీట్‌లో 720 గానూ 705 మార్కులు రావడం అతనికి ఎలా సాధ్యం? నెగెటివ్‌ స్కోరింగ్‌ విధానం ఉన్న పరీక్షలో 719, 718 మార్కులు ఎలా వస్తాయి? హర్యానాలోని ఒకే సెంటర్‌ నుంచి 80 మందికి ర్యాంకులు రావడమేంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలాంటి వారు ఎయిమ్స్‌ లాంటి ప్రతిష్టాత్మక వైద్యవిద్యా సంస్థల్లో చదువు’కొని’ ఎంబీబీఎస్‌ డాక్టరర్లై ప్రజలకు ఏం వైద్యమందిస్తారని మోడీ సర్కార్‌ను నిలదీశారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షలోనూ పెద్ద ఎత్తున పోస్టులను అమ్ముకున్నారని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు విద్యా, వైద్య వ్యవస్థలతో పాటు అన్నింటినీ విధ్వంసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా జాతీయ వ్యతిరేక విధానాలను విద్యార్థుల్లోకి జొప్పించే యత్నం జరుగుతున్నదని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగానూ 2024కు ప్రత్యేకత ఉందనీ, ఈ ఏడాది 64 దేశాల్లో ఎన్నికలు జరిగాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రైట్‌ వింగ్‌కు ఎక్కువ సానుకూల ఫలితాలు వచ్చాయనీ, కార్పొరేట్ల చేతుల్లో ప్రపంచం ఉండటమే దీనికి కారణమని వివరించారు. లెఫ్ట్‌ వింగ్‌ పెరగటం కార్పొరేట్లకు అస్సలు గిట్టదన్నారు. ఇండియాతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మెజార్టీ మీడియా కొంత మంది బడా కార్పొరేట్ల చేతుల్లో బందీగా ఉందని చెబుతూ ఆయా దేశాల గణాంకాలను వివరించారు. కార్పొరేట్‌ మీడియా రైట్‌ వింగ్‌కు ఎంత సపోర్టు చేస్తున్నప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతున్న లెఫ్ట్‌ వింగ్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతున్న తీరును వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనీయన్ల పోరాటానికి మద్దతు పెరుగుతున్నదన్నారు. బ్రిటన్‌, అమెరికాతో పాటు మనదేశంలోనూ పెద్దఎత్తున విద్యార్థులు, ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారని చెప్పారు. అమెరికా ఆధిపత్యం కోసం ప్రచ్ఛన్న యుద్ధాలను సృష్టిస్తున్నదని విమర్శించారు. అయితే, దీన్ని తిప్పికొట్టడానికి అనుసరించే భావజాలమే కీలకమనీ, అమెరికా దాడిని తిప్పికొట్టడానికి అది దోహదపడు తుందని వివరించారు. ఇరాక్‌కు ఒక ఐడియాలజీ లేదు కాబట్టే అమెరికా దానిపై సులువుగా విజయం సాధించిందని చెప్పారు. మోడీ గ్యారంటీ, రామమందిరం గెలిపిస్తాయని ముందుకెళ్లిన ఎన్డీయేకు ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. అయోధ్య రామాలయంతో పాటు ప్రముఖ దేవస్థానాలున్న నియోజకవర్గాల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. మోడీ భగవాన్‌కే భగవాన్‌ అన్న ప్రచారం బెడిసికొట్టిందనీ, దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. చివరకు టీడీపీ, జేడీయూ మద్దతుతో మోడీ తన సర్కారును నడపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎస్‌డీఎస్‌ సర్వేలో దేశంలోని 78 శాతం ప్రజలు హిందూత్వను వ్యతిరేకించారనీ, వారంతా దేశంలో సెక్యూలరిజం ఉండాలని కోరుకున్నారని వివరించారు.
దేశంలోని కార్పొరేట్లకు ఏడాది పాటు పదిశాతం ట్యాక్స్‌ విధిస్తే పేదలందరికీ కిలోకు రూ.3 చొప్పున బియ్యం ఇచ్చే అవకాశముందనీ, ఆ దిశగా మోడీ సర్కారు ఆలోచించాలని సూచించారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చాలని బీజేపీ చూసిందన్నారు. రాజ్యాంగం మారుస్తామన్న మోడీతోనే రాజ్యాంగం గొప్పదని గుండెలకు అతుక్కునేలా చేయడం ప్రజాస్వామ్యం గొప్పతనమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నిరుద్యోగం, ఉపాధి, పేదరికం, నిత్యావసరాల సరుకుల ధరలు తదితరాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.వీరభద్రం, సంయుక్త కార్యదర్శులు మమత, కిరణ్‌, ఉపాధ్యక్షులు రజినీకాంత్‌, అశోక్‌రెడ్డి, బి.శంకర్‌, ప్రశాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love