– ఆక్వాకల్చర్ కంపెనీతో మాట్లాడి ఎలక్ట్రిక్ ఆటో అందించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ స్కూల్ చిన్నారుల ప్రయాణ సౌకర్యం కోసం దాత సౌజన్యంతో ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ ఆటోను అక్కడి ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ స్కూల్ చిన్నారుల కోసం ఆ గ్రామంలోని ఫుడ్ పార్కులో దీపక్ ఆక్వా కల్చర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న యాజమాన్య బాధ్యులతో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడి వారి సహకారంతో ఈ ఎలక్ట్రిక్ ఆటోను పాఠశాలకు మంగళవారం అందజేశారు. చిన్నారుల కోసం ఇలాంటి ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పించిన ఘనత రాష్ట్రంలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌కు దక్కింది. ఆటో ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే స్థానిక అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించి, చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు, ఎంపీడీఓ రావెళ్ల చిన్న నాగేశ్వరావు, ఉపాధ్యాయులు, స్థానిక ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు రవీంద్ర బాబు, కీసర రాంబాబు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల భద్రత, విద్యా సౌకర్యాలపై ఎమ్మెల్యే దంపతులు చూపిన ఈ ప్రత్యేక చొరవ పట్ల స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.



