– ప్రారంభమైన బడిబాట
– సత్ఫలితాలు ఇస్తున్న ఉపాధ్యాయుల కృషి
నవతెలంగాణ – అశ్వారావుపేట
కార్యాచరణ ఏదైనా సత్ఫలితాలు ఇస్తేనే ఆ కార్యానికి సార్ధకత ఉంటుంది. క్షీణిస్తున్న ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది. గురువారంతో విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ, బడిబాట కార్యక్రమాన్ని వారంరోజులుగా నిర్వహిస్తూ బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలను గుర్తించి, వారికి విద్య హక్కు అందేలా కృషి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఈ సందర్భంగా మండలంలోని నారంవారిగూడెం పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు రజని తన అనుభవాలను పంచుకుంటూ బడిబాట ప్రాధాన్యతను వివరించారు. “విద్యార్థుల నమోదు పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే బడిబాట ముఖ్య ఉద్దేశం. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది,” అని ఆమె తెలిపారు.
బడిబాట ద్వారా గుర్తించిన ఒక విద్యార్థి కథ ఈ కార్యక్రమం ప్రభావాన్ని చూపుతోంది. గుల్ల మోక్ష సాయి వర్ధన్ అనే దివ్యాంగ బాలుడు (పుట్టుకతోనే మాట్లాడలేని పరిస్థితి) కుటుంబ పరిస్థితుల వల్ల చదువు దూరమయ్యాడు. ఉపాధ్యాయ బృందం అతన్ని గుర్తించి పాఠశాలలో మొదటి తరగతిలో చేర్చింది.
పాఠశాలలో చేరిన తరువాత అతనిలో వచ్చిన మార్పులు గమనార్హం. తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం, ఉపాధ్యాయులు చెప్పే పదాలు, గేయాలు పలకాలని ప్రయత్నించడం, చిన్న చిన్న సహాయాలు చేయడం వంటి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఈ విద్యాసంవత్సరంలో అతని హాజరు శాతం 70% ఉండటం విశేషం.
ఇదే విధంగా గతంలో వేదాంతపురం గ్రామంలో ఒక మానసిక దివ్యాంగ విద్యార్థిని గుర్తించి పాఠశాలలో చేర్చడం ద్వారా, ఆమెకు అవసరమైన సర్టిఫికెట్ పొందేలా ఉపాధ్యాయులు మార్గదర్శనం చేశారు. ప్రస్తుతం ఆమె ప్రతినెలా పెన్షన్ పొందుతూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటోంది.
ఇలాంటి సంఘటనలు బడిబాట కార్యక్రమం పాఠశాలలకే కాదు, విద్యార్థుల జీవితాల్లో కూడా ఎంతటి మార్పు తీసుకువస్తుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంపొందిస్తూ, ప్రతి చిన్నారికి విద్య హక్కు అందించే దిశగా ఉపాధ్యాయుల కృషి నిజంగా అభినందనీయం.


