నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేటలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాహిత్య వాతావరణం మధ్య “సమీక్షా సౌగంధికాలు” పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. అశ్వారావుపేట సి.ఆర్.పి, సాహితీమిత్ర సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల చేత పుస్తకాలపై సమీక్షలు రాయించడం మాత్రమే కాకుండా, వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు. పాఠశాల గ్రంథాలయంలో చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయడం విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రత్యేకమైన కళగా అభివర్ణించారు.
గ్రంథాలయ ఇన్‌చార్జి, తెలుగు ఉపాధ్యాయులు పుల్లారావు, దుర్గయ్య, రమాదేవి కృషితో విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. విద్యార్థులు పుస్తకాల వైపు మళ్లితే సెల్‌ఫోన్ వినియోగం తగ్గుతుందని, తల్లిదండ్రులు కూడా ఇంటివద్ద పిల్లలను పుస్తక పఠనానికి ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పుస్తక సంపాదకులు సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



