ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
కార్మికుల మనోధైర్యానికి నిదర్శనం భ్రమరాంబిక నగర్ : సీఐటీయూ
రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
బీరంగూడలో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్
నవతెలంగాణ- అమీన్‌పూర్
కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడే ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలోని భ్రమరాంబిక నగర్, మాస్టర్ మైండ్ స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, ఈఎసఐ రామచంద్రా పురం ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చుక్క రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు ఎండలు తీవ్రంగా ఉండగా.. మరోవైపు వర్షాలు కురవడం ప్రకృతి వైపరీత్యమన్నారు. కార్పొరేట్ కంపెనీలు కేవలం లాభాల కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయని, ఫలితంగా సామాన్య ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్య నివారణకు నిధులు ఖర్చు చేయకుండా వెనకాడుతున్నాయని, దీనివల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని వివరించారు.
దేశంలో పౌష్టికాహార లోపం కూడా ప్రజారోగ్యంపై పెను ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎవరూ ప్లాట్లు కొనేందుకు ముందుకురాని బీడు భూముల్లో.. అగర్వాల్ రబ్బరు కార్మికుల కోసం భ్రమరాంబిక నగర్ కాలనీని ఏర్పాటు చేశామని తెలిపారు. సాండ్విక్, ఏసియన్ పెయింట్, వీబీసీ వంటి పరిశ్రమల కార్మికులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, మనోధైర్యంతో ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్నారని గుర్తు చేశారు. నేడు ఈ ప్రాంతం ప్రైమ్ ఏరియాగా, అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందడం అభినందనీయమని, కాలనీవాసుల ఐకమత్యమే దీనికి కారణమని చెప్పారు. మేడే ఉత్సవాల ముగింపు సందర్భంగా కార్మికులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతోపాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కె.కల్పనా రఘునాథ్, ఈఎసఐ రామచంద్రాపురం సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి నాయిని లలిత, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య, రైతు సంఘం నేత వెంకట్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, నాయకులు పాండురంగారెడ్డి, నరసింహారెడ్డి, జార్జ్, శ్రీనివాస్, అర్జున్, సత్తిబాబు, వీరస్వామి, జిలాని, సునీత, పద్మావతి, లావణ్య పాల్గొన్నారు.
కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



