పాఠశాల విద్యపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈ ఏడాది యధావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ఆయన ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీన ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదని పాత పద్దతిలో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్ ను రద్దు చేసి సీబీఎస్ఈలో తరహాలో 11, 12 తరగతులు నిర్వహించాలనీ, ఫలితంగా డ్రాపౌవుట్స్ గణనీయంగా తగ్గుతాయని తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ‘సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అప్పటితో విద్యను నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలి’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొందన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పాత పద్దతిలోనే కొనసాగాలని సర్కార్ నిర్ణయించిందని సీఎం తెలిపారు. విలీనంతో ముడిపడిన సాంకేతిక సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలన్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



