అగ్ని ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి: ఏసీపీ

నవతెలంగాణ – ఆర్మూర్  

అగ్ని ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వా రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో శనివారం తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో గల వస్తువులను అల్మారాలలో, సెల్పులలో సక్రమంగా ఉంచుకోవాలని, చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు ఇతర మండే పదార్థాలను అందుబాటులో ఉంచవద్దని, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఎల్లవేళలా నీటిని ఇంట్లో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ఎస్ ఎఫ్ ఓ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. షాపింగ్ మాల్స్ యందు ఎలక్ట్రికల్ సామాన్లు ఐఎస్ఐ మార్కు కలిగిన వాటిని మాత్రమే వాడాలని సూచించారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే 101 నంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు. అగ్ని ప్రమాద రహిత తెలంగాణ కోసం కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎం ప్రకాష్, అనంతరావు, వంశీ ,రాజకుమార్, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love