పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

– జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నంద లాల్‌ పవార్‌
– జిల్లాలో 37 పోలింగ్‌ కేంద్రాలు, 32 రూట్లు
– భద్రతా దళాలతో పోలింగ్‌ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది
నవతెలంగాణ – వనపర్తి
పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా సోమవారం వనపర్తి జిల్లాలో జరిగే పోలింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నంద లాల్‌ పవార్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణకు బయలుదేరిన పోలింగ్‌ సిబ్బంది, భద్రతా దళాల వాహనాలకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి జెండా ఊపి శుభాకాంక్షలు తెలుపుతూ సాగనంపారు. ఉదయం నుండి చిట్యాల మార్కెట్‌ గోదాములో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఎన్నికల అధికారి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో 307 పోలింగ్‌ కేంద్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించే విధంగా పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 307 పోలింగ్‌ స్టేషన్‌ లకు 32 రూట్‌ లు 16 కౌంటర్‌ లు ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని మెటీరియల్‌, ఈవియం లు తీసుకొని భద్రతా దళాల కట్టుదిట్టమైన భద్రతా మధ్య రూట్‌ ల వారీగా పంపించడం జరిగిందన్నారు. ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిరహించాలని ఆదేశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వరకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని అక్కడ రేపటి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉదయాన్నే 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభించి అన్ని క్లియర్‌ చేసిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభించి పారదర్శకంగా ముగించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో చలువ నీడ తో సహా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నేటి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటహక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా నచ్చిన వ్యక్తికీ ధైర్యంగా ఓటు వేయాలని మీడియా ముఖంగా జిల్లా ప్రజలను కోరారు.

Spread the love