అనుభవజ్ఞులైన వైద్యులు

Experienced doctors– ఆధునాతన ఆపరేషన్ల సౌకర్యం
– అన్ని టెస్టులు చేసే సౌలభ్యం
– తక్కువ ధరలకే కార్పొరేట్‌ స్థాయి చికిత్సలు
– నవతెలంగాణతో ఇంటర్వ్యూలో
– నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గతంతో పోలిస్తే రోగాలు, రోగుల సంఖ్య పెరిగిపోతున్నది. వైద్యం పేదవారికి ఖరీదైనా భరించలేనిదిగా మారుతున్నది. ఒకసారి జబ్బుల బారిన పడితే కుటుంబాలు పెట్టే ఖర్చుతో అప్పులు పాలు కావడం, దారిద్య్ర రేఖ దిగువనకు దిగజారిపోతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ వ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు తమకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం దొరకాలని ఆశిస్తుంటారు. అయితే కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రుల్లో వేస్తున్న ఛార్జీలు వారిని మరింత కుంగదీస్తున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో అవసరానికి మించిన టెస్టులు, చికిత్సల పేరుతో మోసాలు, బాధితులుగా మారుతున్న రోగులు, వారి కుటుంబాల ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలపాటు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన గిరిజన యువకునికి ఇటీవల నిమ్స్‌ వైద్యులు ఉచితంగా ఆపరేషన్‌ చేసి ప్రాణాలు నిలిపారు. అలా ఎందరో పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా నిమ్స్‌ ఆస్పత్రి అందిస్తున్నది. ఆ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్పతో ఇంటర్వ్యూ….
ప్రశ్న… ఇటీవల కాలంలో నిమ్స్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా సంక్లిష్టమైన అత్యాధునిక శస్త్రచికిత్సలు నిర్వహిస్తోంది. ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా మీకు ఇది ఎలా సాధ్యమైంది.?
డాక్టర్‌ బీరప్ప… నిమ్స్‌కు యూనివర్సిటీ స్థాయి ఉండటంతో పీజీ, సూపర్‌ స్పెషాలిటీ బోధనా సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రోగుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వైద్యవిద్యార్థులు నేర్చుకునేందుకు అవకాశమెక్కువ. అందుకే నీట్‌లో టాప్‌ ర్యాంకర్లు ప్రాధాన్యతనిస్తారు. టీచింగ్‌ మెటీరియల్‌ పుష్కలంగా ఉంది. ఢిల్లీలో ఎయిమ్స్‌ కన్నా ఏమి తక్కువ కాకుండా ఆపరేషన్లు, ప్రొసీజర్లు, చికిత్సలు చేస్తున్నాం. అత్యధికంగా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే జరుగు తున్నాయి. నిమ్స్‌ విద్యార్థులకు కార్పొరేట్‌ నుంచి భారీ స్థాయిలో డిమాండ్‌ ఉంటుంది. ప్రతిష్టాత్మక వైద్యవిద్యా సంస్థల నుంచి వచ్చిన ఏండ్ల తరబడి అనుభవం కలిగిన 350 మంది వరకు బోధనా సిబ్బంది ఉన్నారు. ఎక్కువగా ప్రయివేటు ఆస్పత్రుల్లో రాత్రి వేళల్లో ఎంబీబీఎస్‌ చేసిన డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ అందుబాటులో ఉంటారు. అదే నిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ, బ్రాడ్‌ స్పెషాలిటీ చేసిన వైద్యులు నిరంతరాయంగా అందుబాటులో ఉంటారు. చిన్నైనా, పెద్దవైనా సరే… రోగ నిర్దారణ పరీక్షలు చేసేందుకు వెనుకాడేది లేదు.
ప్రశ్న…నిమ్స్‌లో అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, సిబ్బంది, సదుపాయాలపై వివరిస్తారా?
డాక్టర్‌ బీరప్ప ….నిమ్స్‌లో 1638 బెడ్లున్నాయి. 350 మంది అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రతిష్టాత్మక వైద్యవిద్యా సంస్థల నుంచి వచ్చిన వారు. 500 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 1000 మంది నర్సులు, మరో వెయ్యి మంది నాలుగో తరగతి సిబ్బంది సేవలందిస్తున్నారు. 28 ఆపరేషన్‌ థియేటర్లుంటే అందులో 24 మాడ్యూలర్‌ ఆపరేషన్‌ థియేటర్లు (జీరో బాక్టీరియా)ఉన్నాయి. ఈ థియేటర్లలో 15 రోజులకు ఒకసారి బాక్టీరియా, వైరస్‌, ఫంగల్‌కు సంబంధించి తనిఖీ చేస్తాం. నిరంతరం బాక్టీరియా లేకుండా చర్యలు కొనసాగిస్తుంటాం.
ప్రశ్న… ఆరోగ్యశ్రీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, జర్నలిస్టులందరికీ సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకాలు నిమ్స్‌లో వర్తిస్తున్నాయా? లేదా?
డాక్టర్‌ బీరప్ప… ఈ పథకాలను నిమ్స్‌ నిక్కచ్చిగా అమలు చేస్తున్నది. ప్రయివేటు ఆస్పత్రులు నిరాకరించినా… నిమ్స్‌ సేవలను కొనసాగిస్తున్నది. ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీ రేట్లతో చికిత్సలు అందిస్తుండటంతో పేద రోగులకు ఆర్థిక ఇబ్బంది ఉండదు. నిమ్స్‌ నిబద్ధతతో కూడిన సేవలంది స్తున్నందునే ప్రతి ఏటా చికిత్స కోసం నిమ్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. 2017లో ఆరోగ్యశ్రీ రోగులు 70 వేల మంది వస్తే అది కాస్తా 1,40,000కు, ఈహెచ్‌ఎస్‌ రోగులు 4000 నుంచి 16 వేలకు, జెహెచ్‌ఎస్‌ పరిధిలో 1,800 నుంచి 2,260కు పెరిగారు. అదే విధంగా 2018లో సీఎంఆర్‌ఎఫ్‌ కింద 1,424 మంది సేవలు పొందితే అది కూడా 8,046కు పెరిగింది.
ప్రశ్న..అనేక పథకాల కింద సేవలందిస్తున్నామని చెబుతున్నారు. అయితే నిమ్స్‌లో వైద్యసేవలు, ముఖ్యంగా అత్యవసర చికిత్సలు ఆలస్యమవుతున్నాయి. ఆ జాప్యాన్ని నివారించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
డాక్టర్‌ బీరప్ప… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇస్తున్న సహకారంతో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. దీంతో రోగుల రద్దీ పెరిగినా… వైద్యసేవలు సకాలంలో అందుతున్నాయి. న్యూరో సర్జరీ, కార్డియో థొరాసిక్‌ రోగులకు వేచి చూడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇటీవల కాలంలో ప్రమాదాల బారిన పడిన రోగులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, హార్ట్‌ అటాక్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆకస్మికంగా పెరిగిన ఒత్తిడి కారణంగా తాత్కాలికంగా ఏర్పడిన ఇబ్బంది ఇది. దీన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం.
ప్రశ్న…నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదనలు పంపించారా?
డాక్టర్‌ బీరప్ప…. దేశంలో ప్రతిష్టాత్మక ఆస్పత్రిగా నిమ్స్‌ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని రోగులకే కాకుండా పలు రాష్ట్రాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మల్టీ స్పెషాలిటీ సేవలతో హైదరాబాద్‌ నిమ్స్‌ కెళితే చికిత్స లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించాం. అంతర్జాతీయంగా రోగులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇప్పటికే నిమ్స్‌లో రీసెర్చ్‌ కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), సీడీఎఫ్డీ, ఐఐసీటీ, ఐఐఐటీ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని ముందుకెళ్తున్నాం. పలు సైంటిఫిక్‌ సంస్థలు నిమ్స్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒకవైపు రీసెర్చ్‌, మరో వైపు రోగులకు సేవలు, ఇంకో వైపు మెరుగైన వైద్య విద్యనందించడం బహుముఖంగా సేవలందిస్తున్న నిమ్స్‌లో వివిధ విభాగాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ పరికరాల కోసం ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం. మరో 90 మంది బోధనా సిబ్బందినివ్వాలని కోరాం. మరో వంద మంది వరకు నర్సులను నియమించుకోవాల్సి ఉన్నది. ఒకట్రెండు నెలల్లో నిమ్స్‌ స్టెమ్‌సెల్స్‌ థెరపీ సేవలను అందించనుంది. వైద్యరంగంలో నిమ్స్‌ను లీడర్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.

Spread the love