ఒకప్పుడు ఇంటిముందు
అరుగు మీద కూర్చొని పంచుకున్న నవ్వులు,
ఇప్పుడు మొబైల్ స్క్రీన్‌ల వెలుగుల్లో
నీడలుగా తిరుగుతున్నాయి
అప్పుడు ఒక పిలుపుతో ఇల్లు నిండా
మనుషులు చేరే రోజులు,
ఇప్పుడు
వందలాది సంబంధాలు కలిగి ఉన్నా
మనసుకు చేరే మనిషి అరుదయ్యాడు
రక్త సంబంధాల కంటే
అవసరాలు అల్లిన బంధాలే పెరిగాయి,
ఆప్యాయతల చెట్టు కింద
స్వార్థపు గొడ్డళ్లు నాటబడ్డాయి
అమ్మ చేతి ముద్దలోని ప్రేమ,
నాన్న భుజంపైన భరోసా,
తోబుట్టువులతో అల్లరి…
అన్నీ జ్ఞాపకాల అల్మారాలో
దుమ్ము పట్టిన ఫోటోలయ్యాయి
కాలం మారిందో…
మనుషులు మారారో తెలియదు గానీ,
బంధాలు మాత్రం అడవిలో జాడ తప్పిన
జంతువుల్లా మగ్యమవుతున్నాయి.
అయినా… ఒక పలకరింపు,
ఒక నిజమైన ఆత్మీయత,
ఒక నిస్వార్థమైన చేయూత చాలు…
మగ్యమవుతున్న బంధాలను
మళ్లీ మన గుండెల్లోకి ఆహ్వానించడానికి !
– న్యాలకంటి నారాయణ, 9550833490
కనుమరుగవుతున్న బంధాలు
- Advertisement -
- Advertisement -



