– టెస్టులతో పాటు వన్డేలకూ గుడ్‌బై
సిడ్నీ : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌తో పాటు వన్డేలకు వీడ్కోలు పలికాడు. జనవరి 3 నుంచి పాకిస్థాన్‌తో సొంత మైదానం సిడ్నీలో జరిగే న్యూ ఇయర్ టెస్టు డెవిడ్ వార్నర్‌కు ఆఖరు కానుంది. ఈ విషయం వార్నర్ ముందే ప్రకటించినా.. వీడ్కోలు టెస్టు ముంగిట వార్నర్ మరో నిర్ణయం సైతం తీసుకున్నాడు. ‘ వన్డేలు ఆడతానని ప్రపంచకప్ విజయం అనంతరం చెప్పాను. కానీ ఇప్పుడు కుటుంబంతో మరింత సమయం గడిపేందుకు వన్డే క్రికెట్‌కు సైతం వీడ్కోలు పలుకుదామని నిర్ణయం తీసుకున్నాను. ఆసీస్ వన్డే జట్టు సైతం ముందుకు సాగేందుకు నా నిర్ణయం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌కు నా సేవలు అవసరమని భావిస్తే… నేను సదా సిద్ధంగా ఉంటాను’ అని డెవిడ్ వార్నర్ తెలిపాడు. 37 ఏండ్ల డెవిడ్ వార్నర్ 2009లో వన్డే అరంగ్రేటం చేశాడు. 163 వన్డేల్లో 45.30 సగటుతో 22 సెంచరీలు సహా 6932 పరుగులు చేశాడు. బుధవారం పాకిస్థాన్‌తో సిడ్నీ టెస్టు వార్నర్‌కు కెరీర్ 112 టెస్టు మ్యాచ్ కానుంది.