
– విజ్ఞప్తి చేసి నాలుగు రోజులైనా పట్టించుకోవడం లేదని రైతు బైఠాయింపు
– ధ్వంస చేసిన వరిపైరుతో జీపీ వద్ద రైతు బోనగిరి లింగయ్య అందోళన
– నాలుగేకరాల వరిపైరును వరహాలు ధ్వంసం చేశాయని రైతు అవేదన
నవతెలంగాణ-బెజ్జంకి :
రైతు సంక్షేమమే ద్యేయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే..గత నాలుగు రోజులుగా వరహాలు స్వైర విహారం చేస్తూ వరిపైరును ధ్వంసం చేస్తున్నాయని నివారణ చర్యలు చేపట్టాలని పంచాయతీ పాలకవర్గం సభ్యులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని.. ఆరుగాలం కష్టపడి పని చేసే రైతంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా అని మండల కేంద్రానికి చెందిన ఓ రైతు అగ్రహం వ్యక్తం చేశాడు. గ్రామంలోని వరహాలు ధ్వంసం చేసిన వరిపైరుతో రైతు బోనగిరి లింగయ్య శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద బైఠాయించి అందోళన వ్యక్తం చేశాడు. గత కొద్దిరోజులుగా గ్రామంలోని వరహాలు స్వైర విహారం చేస్తూ వరిపైరును ధ్వంసం చేస్తున్నాయని పాలకవర్గం సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోకపోవడం వల్ల నేడు తన నాలుగేకరాల వరిపైరును ధ్వంసమైందని రైతు లింగయ్య పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బందికి తనగోడును వెల్లడించాడు. ధ్వంసమైన వరిపైరును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తనకు న్యాయం చేయాలని రైతు విజ్ఞప్తి చేశాడు. గ్రామ పంచాయతీ వద్ద ధ్వంసమైన వరిపైరుతో అందోళన చేస్తున్న రైతు లింగయ్యను పలువురు గ్రామ రైతులు పరిశీలించి పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.