నవతెలంగాణ–పరకాల
ఎల్‌నీనో ప్రభావంతో వరి సాగులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గుచూపాలని వ్యవసాయ శాఖ ఏఈఓ అహ్మద్ రజా సూచించారు. పరకాల మండలం వెల్లంపల్లి క్లస్టర్ గ్రామంలో శుక్రవారం ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడంతో పాటు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఈఓ అహ్మద్ రజా మాట్లాడుతూ..తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పెసర, మినుము, కంది తదితర ఆరుతడి పంటల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆరుతడి పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పంటల సమర్థవంతమైన నిర్వహణ ద్వారా మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. ఆయా పంటలకు ఉన్న మార్కెట్ అవకాశాలను కూడా రైతులకు వివరించారు.అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రాధాన్యతపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


