రైతు భరోసాను వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – హలియా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసాని వెంటనే జమ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో నాగార్జునసాగర్ పార్టీ నియోజకవర్గ స్థాయి మండల కార్యదర్శిల జిల్లా కమిటీల సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు  రైతు భరోసాను ఎకరాకు రూ.5వేల నుండి రూ.7500 వరకు పెంచుతామని మేము అధికారంలోకి రాగానే జమ చేస్తామని చెప్పారని, అందుకోసం రైతు భరోసా పై విధివిధానాలు ప్రకటించి వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని కోరారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు ఎరువులు కూలీలు, దుక్కి దున్నడానికి ఇతర వ్యవసాయ పనులకు రైతులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  వ్యవసాయ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్న విత్తనాలు ఎరువులు సకాలంలో అందడం లేదని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసంపదైన బొగ్గు గనులను వేలం వేయడం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడమేనని వెంటనే బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ సర్కార్ రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కున్ రెడ్డి నాగిరెడ్డి, సిహెచ్ లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ.. పార్టీని ప్రజా సమస్యల పై ఉద్యమాలకు సన్నద్ధం చేయడానికి జులై 8న నిడమనూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల విస్మరిస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, అవుత సైదయ్య, మండల కార్యదర్శులు దుబ్బ రామచంద్రయ్య, దైద శ్రీను మండల నాయకులు కత్తి శ్రీనివాస్ రెడ్డి, వేములకొండ పుల్లయ్య, జె రవి నాయక్, పి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love