రైతు సదస్సుల జాడేది.?

– కనిపించని రైతు అవగాహాన సదస్సులు
– పురాతన పద్ధతిలోనే సాగు చేస్తున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసినా సరైన దిగుబడులు రాక రైతన్నలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్తాయిలో గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు పంటల సాగుపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతు చైతన్య యాత్రల పేరుతో  రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెరు మార్చి 2015 నుంచి 2017 వరకు మన తెలంగాణ-మన వ్యవసాయం పేరిట రైతు సదస్సులు ఏర్పాటు చేశారు.సీజన్ ప్రారంభంలో పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించి రైతులను పంటల సాగుకు సంసిద్ధం చేసేవారు.రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు పొందేవారు. కానీ 2018 నుంచి మండలంలో రైతు సదస్సులు కనిపించడం లేదు. దీంతో చాలామంది రైతులు మూస ధోరణిలో పంటలు సాగు చేస్తూ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోతున్నారు.
మండలంలో ఇలా..మండలంలోని 15 గ్రామాల్లో మొత్తం 22,345 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 15,145 వేల ఎకరాలు, పత్తి 5,100 వేల ఎకరాలు,  మిర్చి 2 వేల ఎకరాలు,వివిధ పంటలు 100  ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
సదస్సుల ద్వారా చేయాల్సినవి..
1 మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచార రతాల ద్వారా పంట సాగుపై ప్రచారం నిర్వహించాలి.
2 వ్యవసాయశాఖ అధికారులతో సాగు అనుబంధంగా ఉన్న ఇతర శాఖలు అందించే ప్రోత్సాహకాలు గురించి రైతులకు తెలియజేయాలి.
3 రైతుల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు  చేస్తున్న పథకాలపై వాటినీ సద్వినియోగం చేసుకునేలా రైతులను చైతన్యం చేయాలి.
4 పంటల సాగుకు ముందు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలు సందర్భంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలి.
5 అధిక దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు నిర్వహించి భూమిలో ఏ మూలకాల లోపం ఉందో రైతులకు తెలిపి వాటి లోపం నివారించేందుకు అవసరమైన సూచనలు చేయాలి.
కనిపించని అవగాహన సదస్సులు..ప్రస్తుతం మండలంలో రైతులు రబీ పంటల సాగులో నిమగ్నమయ్యారు. అనేక చోట్ల ఇదివరకే నాట్లు వేశారు. కానీ ఇప్పటివరకు పంటల సాగుపై రైతులకు ఎటువంటి అవగాన సదస్సులు నిర్వహించకపోవడంతో  రైతులు తమకు తెలిసిన పద్ధతుల్లోనే పంటలు సాగు చేశారు. దీంతో ఆశించిన దిగుబడులు వస్తాయో లేవో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు : వ్యవసాయ అధికారులు..రైతుల అవగాన కోసం మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమాన్నీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.అక్కడక్కడా  ఏఈఓ లు గ్రామాల్లో రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
Spread the love