– ద్రిష్టి 10 స్టార్ లైనర్ యూఏవీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎయిరో స్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఎయిరో స్పేస్ ఎకోసిస్టమ్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, వాణిజ్య, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎయిరో స్పేస్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. శంషాబాద్ లోని ఆదానీ డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ సెంటర్ లో భారతీయ నేవీ కోసం ఆదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి 10 స్టార్ లైనర్ అన్ మానవరహిత ఏరియల్ వాహనం (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ఎయిరో స్పేస్, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల రంగానికి తెలంగాణ ముఖ్యమైన కేంద్రమని తెలిపారు. ఎయిరోస్పేస్ తయారి, సర్వీసింగ్, ఇంజనీరింగ్, శిక్షణ సంస్థలను నెలకొల్పడానికి రాష్ట్రంలో అనేక ఎయిరో స్పేస్, అనుబంధ పార్కులు ఉన్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉందని పరిశ్రమ వర్గాలు ప్రశసించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎయిరో స్పేస్, అనుబంధ రంగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 1000కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ఉన్నాయని, స్థానిక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు అంతర్గాతీయ ఎయిరోస్పేస్ సప్లై చైన్ లోకి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుచూ ఒరిజినల్ పరికరాల తయారిదారుల (ఓఈఎం)తో సప్లై చైన్ ఈవెంట్లను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఓఈఎం లైన లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, రాఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ తదితర సంస్థల నుంచి రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్శించిందని వివరించారు. ఎయిరోస్పేస్ రంగానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి 2018లో, 2020లో, 2022లో ఉత్తమ రాష్ట్ర అవార్డులను అందుకున్నదని, 2016-2020 మధ్యకాలంలో రాష్ట్రంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ ను భవిష్యత్తులో తక్కువ ఖర్చతో అయ్యే ఎయిరోస్పేస్ సిటీగా గుర్తించిన ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్డీఏ తన అంతర్జాతీయ ర్యాంకింగ్ లో హైదరాబాద్ కు మొదటి ర్యాంకు ఇచ్చిందని స్పష్టం చేశారు. రక్షణ పరికరాల తయారి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆదానీ డిఫెన్స్, ఎయిరోస్పేస్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకుందని, కేవలం 10 నెలల వ్యవధిలో యూఏవీల తయారి కోసం మొదటి కార్బన్ ఎయిరోస్ట్రక్చర్స్ ను నెలకొల్పిందని తెలిపారు. ఆదానీ సంస్థ హైదరాబాద్ లో 25 సరఫరాదారులతో సంబంధాలు సాగిస్తున్నదని చెప్పారు. ఆ సంస్థ డీఆర్డీవోకు ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. మిసైల్స్ తయారీకి హైదరాబాద్ ఉత్పత్తి కేంద్రంగా మారిందని స్పష్టం చేశారు. ఆదానీ సంస్థ హైదరాబాద్ నుంచి దాదాపు 20కిపైగా మానవరహిత ఏరియస్స్ సిస్టమ్స్ ను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసిందని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. తాము పెట్టబడులను స్వాగతిస్తున్నామని, ఆదానీ సంస్థ నెలకొల్పోబోయే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు.