తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందుతో రైతుల ధర్నా 

– కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరి పట్ల నిరసన 

– తమ భూముల్లో కరెంటు పనులు ఎలా ఆపుతారని అధికారుల నిలదీత
– అన్ని సరిగ్గానే ఉన్నాయంటూనే మళ్లీ సర్వేలు ఎందుకని ప్రశ్న 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి గ్రామానికి చెందిన రైతులు, మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు శనివారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట అధికారుల వైఖరి, అధికార పార్టీ నాయకుడి వైఖరిని నిరసిస్తూ  పురుగుల మందు డబ్బాతో ధర్నాకు దిగారు. తమ భూముల్లో పంటలు పండించేందుకు అవసరమైన విద్యుత్ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్యాయంగా అడ్డుకుంటున్నారని నిరసిస్తూ రైతులు పురుగుల మందు డబ్బా చేత పట్టుకొని న్యాయం జరగకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని చేసిన ఈ నిరసన కలకలం సృష్టించింది. బాధితులు, తహసిల్దార్ ఆంజనేయులు పేర్కొన్న ప్రకారంగా వివరాలు ఇలా ఉన్నాయి…. మండలంలోని చౌట్ పల్లి కి చెందిన మాజీ సర్పంచ్ మారు శంకర్ కుటుంబం తోపాటు మరో రెండు రైతు కుటుంబాలు మండలంలోని చౌట్ పల్లి పక్కనే గల అమీర్ నగర్ గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 73లో  గల 20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. గతంలో ఈ భూమిపై వివాదం నెలకొనగా రెవిన్యూ, అటవీ శాఖ ఉన్నతాధికారులు జాయింట్ సర్వే నిర్వహించి మాజీ  సర్పంచ్ శంకర్, సదరు రైతులకే ఈ భూమి చెందుతుందని తెలిసి చెప్పారు. ఈ భూమి విషయంలో ఎలాంటి వివాదం కూడా లేదని తేల్చారు.  అనంతరం ఈ భూముల్లో అభివృద్ధి పనుల క్రమంలో విద్యుత్ స్తంభాలు,  లైన్ పనులు చేసుకుంటున్నారు. శనివారం ఉదయం  విద్యుత్ అధికారులు విద్యుత్ పనులకు రాకపోవడంతో రైతులు బషీరాబాద్ ట్రాన్స్కో ఏఈ కృష్ణను ఫోన్ చేసి అడిగారు. సమాధానంగా ఈ భూమిలో పనులు చేసేందుకు కరెంటు సిబ్బంది ఎందుకు తొందర పడుతున్నారు.. ఆ భూములపై ఫిర్యాదు వచ్చింది అని తహసిల్దార్ ఫోన్లో చెప్పడంతో తాము పనులకు రాలేదని ఏఈ వివరించాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన రైతులు వారి కుటుంబ సభ్యులతో తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో ధర్నాకు దిగారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పాత్రికేయులకు, కార్యాలయానికి పనుల మీద వచ్చిన జనాలతో వారి గోడు వెల్లబోసుకున్నారు. ఉన్నతాధికారులే జాయింట్ సర్వే చేసి ఎటువంటి సమస్య లేదని తేల్చాక… విద్యుత్ అధికారులు అనుమతులు కూడా ఇచ్చాక బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ఈ భూమి వివాదంలో ఉందని, అక్రమంగా ఆక్రమించుకున్నదని అటవీ మంత్రి కొండ సురేఖకు తప్పుడు ఫిర్యాదు చేశాడని బాధిత రైతులు  చెప్పారు. దీంతో మంత్రి కొండ సురేఖ ఎండార్స్ చేసి ఇచ్చిన కాగితం ఆధారంగా తహసిల్దార్ విద్యుత్ లైన్ పనులు ఆపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇబ్బందులపాలు చేయడానికే మరోసారి సర్వే చేస్తామంటున్నారని వాపోయారు. సమాచారం అందిన ఎస్ఐ రాజశేఖర్ తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేస్తున్న రైతులకు నచ్చజెప్పి కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. చర్చల సందర్భంగా సైతం తహసిల్దార్ మాట్లాడుతూ ఇప్పటికీ సదరు రైతుల పక్షాన అన్ని పత్రాలు, అనుమతులు సక్రమంగానే ఉన్నాయని, వివాదం ఏమి లేదంటూనే  మంత్రి నుండి ఎండార్స్మెంట్ వచ్చింది కాబట్టి ఉన్నతాధికారులకు నివేదించక తప్పడం లేదని పేర్కొనడం కోసం మెరుపు. కాగా ఈనెల 12వ తేదీ వరకు సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని రైతులకు తహసిల్దార్ హామీని ఇచ్చారు.
Spread the love