సాగునీరు విడుదల చేయాలని రైతుల రాస్తారోకో..

– స్తంభించిన జనజీవనం…
నవతెలంగాణ – మంథని
ఎస్సార్ ఎస్పి కాల్వ ద్వారా సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు మంథని- పెద్దపల్లి ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో ధర్నా నిర్వహించారు. మండలంలోని సూరయ్యపల్లి,కాకర్లపల్లి, గంగాపురి,పలు గ్రామాలకు చెందిన రైతులు మంథనిలోని పాత పెట్రోల్ పంపు చౌరస్తాలో ఆందోళన దిగారు.అధికారులు,ప్రభుత్వం రైతులను పట్టించుకోని,పంటకు సాగునీరు ఇచ్చిపంటను రక్షించాలని కోరారు. ప్రభుత్వం రబీకి నీరు విడుదల చేస్తామని చెప్పడంతోనే పంటలు వేశామని,చివరికి ఎస్సారెస్పీ నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని మండి పడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత వారం రోజుల క్రితం రైతులు ఆందోళనలు చేపడితే ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి కాల్వ నీటిని విడుదల చేస్తామని చెప్పి ఇచ్చిన హామీని మర్చిపోయారన్నారు. అధికారులు ఎండిపోతున్న పంటలకు నీటిని విడుదల చేసి కాపాడాలని కోరారు. సాగునీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.గత వారం రోజుల క్రితం ఆందోళనలు రైతులు నిర్వహిస్తే అధికారులు ఈనెల 9 వరకు రైతులకు సాగు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చరని,14 తారీకు అయినా నేటికీ నీరు విడుదల చేయక మాటలు నిలుపుకోలేదని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం స్పందించి మా పంటలను ఎండిపోకుండా కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.ఆందోళన వద్దకు మంథని తాసిల్దార్ చేరుకొని మీ పంటలకు నీరు వచ్చేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ హామీ ఇచ్చినప్పటికీ రైతులు ససేమిరా అంటూ బీస్మించుకొని రహదారిపై కూర్చుని నినాదాలు చేశారు.ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపుల వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించి పోవడంతో జనజీవనం సుమారు మూడు గంటల పాటు అతల కుతలమైంది.లారీలు, బస్సులు,బైకులు,ఆటోలు,నిలిచిపోవడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికులకు,ప్రజలకు,బాటసారిలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎండ వేడిమికి తట్టుకోలేక అతలకూతలమైనారు. చివరికి సంబంధిత అధికారులు,పోలీసులు చేరుకొని రైతులను శాంతింపజేసి సాగునీరు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.మంథని సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Spread the love