– పాత పద్ధతిలోనే విద్యుత్ సరఫరా చేయాలి
– ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
యాప్‌ల ద్వారా కాకుండా రైతులకు నేరుగా ఎరువులు, క్రిమిసంహారక మందులు అందజేయాలని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశం శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో సంఘం మండల అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని, యాప్‌ల ద్వారా ఎరువుల పంపిణీ చేయడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి రైతుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే అవకాశం లేదా అవగాహన ఉండదని, అందువల్ల పాత విధానంలోనే ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలని కోరారు.
అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా వినియోగదారులపై అదనపు భారం మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వ్యవసాయ రంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం మండల కార్యదర్శి సీసం రాము, మొడియం దుర్గారావు, మడకం నాగేశ్వరరావు, తుట్టి వీరభద్రం, నారం అప్పారావు, శాంతి తదితరులు పాల్గొన్నారు.



