
అత్యంత ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్ అవార్డులు ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్, ట్రేడ్ ఫెయిర్స్ లో జరగనున్నాయి. ఈ వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లోని అత్యుత్తమ వ్యక్తులను సత్కరించనున్నారు. కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో కలిసి 69వ శోభా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ట్రోఫీని సినీ నటులు మాళవిక మోహనన్, రుక్మిణి వసంత్, ఫిల్మ్‌ఫేర్ చీఫ్ ఎడిటర్ జితేష్ పిళ్లై, శోభా లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుమీత్ చుంఖారే, కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కమర్ డీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరల్డ్‌వైడ్ మీడియా డైరెక్టర్, జెడ్ఈఎన్ఎల్ బీసీసీఎల్ టీవీ, డిజిటల్ నెట్‌వర్క్ సీఈవో రోహిత్ గోపకుమార్ మాట్లాడుతూ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలు సృజనాత్మకతతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడం ద్వారా మమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలు అద్దారన్నారు. ఈ అసాధారణ ప్రతిభను సత్కరించడానికి అంకితభావంతో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ఫిలింఫేర్ చీప్ ఎడిటర్ జితేష్ పిళ్లై మాట్లాడుతూ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ దక్షిణాదిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కథా కథనంతో ప్రేక్షకులను అలరిస్తున్న సినిమాలకు ఇస్తున్నామని తెలిపారు. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 69వ ఎడిషన్‌తో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శోభా లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్ సుమీత్ చుంఖారే మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో భాగస్వామ్యం పట్ల సంతోషంగా ఉందన్నారు. అనేక దశాబ్దాలుగా శోభా, ఫిల్మ్‌ఫేర్ రెండు కలిసి సాగుతున్నాయని తెలిపారు. మా భాగస్వామ్యం విలువలకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కమర్ డీ మాట్లాడుతూ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో భాగం అయినందుకు థ్రిల్‌గా ఉన్నామన్నారు. ఇది సౌత్ ఇండియాలో సినిమాటిక్ ఎక్సలెన్స్ ఐకానిక్ వేడుక అన్నారు.