నవతెలంగాణ-మిడ్జిల్
మిడ్జిల్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు శేఖర్ ఇటీవల అకాల మరణం చెందాడు. ఆయన హఠాన్మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడి, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విషయం తెలుసుకున్న తోటి భవన కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మానవత్వంతో స్పందించారు. శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ మేరకు తమ వంతుగా రూ.16000/-లను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రెక్కాడితే గాని డొక్కాడని భవన కార్మికుని కుటుంబంలో ఇలాంటి విషాదం జరగడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వం, కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందే ప్రభుత్వ ప్రయోజనాలు, బీమా క్లెయిమ్ మొత్తాన్ని బాధిత కుటుంబానికి త్వరగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం అందించిన తోటి కార్మికులను, దాతలను స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాములు, మండల అధ్యక్షుడు పానుగంటి శ్రీనివాసులు, పెద్ద గుండ్ల తాండ సర్పంచ్ రాజు, నాయక్, గిరి, వడ్డె శీను, మల్లేష్, యాదయ్య , బీరయ్య, తదితరులు ఉన్నారు.



