Saturday, August 22, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థుల‌పై పెల్లెట్ గ‌న్స్ వాడ‌కం పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలి

విద్యార్థుల‌పై పెల్లెట్ గ‌న్స్ వాడ‌కం పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలి

- Advertisement -

బాధితుడితో క‌లిసి పోలీస్‌ స్టేష‌న్ ఎదుట‌ రాహుల్ గాంధీ ధర్నా
దాదాపు ఏడున్న‌ర గంట‌ల పాటు ఆందోళ‌న
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి
విద్యార్థులపై పెల్లెట్ గ‌న్స్ వాడ‌కంపై స‌మాధానం చెప్పాలని డిమాండ్‌
దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు…
ఎఫ్ఐఆర్ న‌మోదు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

​నీట్ పేప‌ర్ లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఇటీవల సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్ల‌మెంట్ మార్చ్‌లో విద్యార్థులపై పెల్లెట్ గ‌న్స్ వాడ‌కంపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు, బాధిత కుటుంబం ఆందోళ‌న చేప‌ట్టింది. శుక్ర‌వారం పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేష‌న్‌ ఎదుట‌ బాధితుడితో క‌లిసి ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ ధ‌ర్నా చేప‌ట్టారు. అంతకుముందు పెల్లెట్ గాయాలైన సాహిల్ లోచ‌వ్‌తో క‌లిసి రాహుల్ గాంధీ మందిర్ మార్గ్ పోలీస్‌స్టేష‌న్ వెళ్లారు. అక్క‌డ ‌వారి ఫిర్యాదు స్వీక‌రించేందుకు పోలీసులు నిరాక‌రించ‌డంతో పార్ల‌మెంట్ స్ట్రీట్ ఎదుట ఉన్న పోలీసు స్టేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేందుకు నిరాక‌రించ‌డంతో వారు అక్క‌డే బైఠాయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనీ, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడకంపై సమాధానం చెప్పాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు హోరెత్తించారు. పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీ‌స్‌ స్టేష‌న్‌లోని ‌డీసీపీ కార్యాల‌యంలో దాదాపు ఏడున్నర గంటల పాటు ధర్నా చేప‌ట్ట‌డంతో పోలీసులు దిగొచ్చి ఎఫ్ఐఆర్ న‌మోదుకు అంగీక‌రించారు. పెల్లెట్ గ‌న్‌ బాధితుడు సాహిల్ ఫిర్యాదు అనంత‌రం ఎఫ్ఐఆర్‌ న‌మోదు చేశారు. పెల్లెట్ గ‌న్ గాయాల‌కు సాక్ష్యాలుగా ఆయ‌న‌ నుంచి మెడిక‌ల్ రిపోర్టులు, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను తీసుకున్నారు. అలాగే అప్ప‌టికే ఆయ‌న శ‌రీరం నుంచి తొల‌గించిన పెల్లెట్ల‌ను మీడియాకు చూపించారు.

​బాధితుడి ఫిర్యాదు ఆధారంగా 
 ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయాలి
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌నాయకుడు, లోక్‌‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ జులై 20న శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న చేప‌డుతున్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో దాడి చేయడంతో సాహిల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు. సాహిల్ లోచ‌వ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. పెల్లెట్ గ‌న్స్ వాడ‌కం ప‌ట్ల హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, ప్ర‌ధాని మోడీ కానీ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌న్నారు. ‘‘సాహిల్ శరీరంలో 200కు పైగా పెల్లెట్లు (చిన్న లోహపు గుళికలు) ఉన్నాయని, అందులో ఆయన కంటిలో మూడు పెల్లెట్లు ఉన్నాయని ఎయిమ్స్ నివేదిక పేర్కొంది. ఈ ఘటనలో సాహిల్ కంటికి పెల్లెట్ తగిలి తీవ్ర గాయమైంది. ఆయన తన కంటి చూపును కోల్పోయాడు. అలాగే ఒక కంటితో ఆయ‌న‌కి ఏమీ కనిపించడం లేదు. ఆయన గుండె దగ్గర కూడా పెల్లెట్లు ఉన్నాయి. వాటిని తొలగించడం సాధ్యం కాదు’’ అని అన్నారు. ‘‘దేశంలోని పిల్లలపై పెల్లెట్ గన్‌లను ప్రయోగించాలని అమిత్ షా ఆదేశించారు. అందువల్లే పెల్లెట్‌ ‌గన్‌‌లు ప్రయోగించారు. ఇక్కడ ఒక నేరం జరిగింది. కాబట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మేము డిమాండ్ చేశాం. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని పైస్థాయి నుంచి ఆదేశాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు మాకు చెప్పారు. కానీ ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. ఈ కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం’’ అని అన్నారు. ‘
‘ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ సాహిల్, ఆయ‌న‌ తల్లి పదేపదే పోలీసులను సంప్రదించి నప్పటికీ, పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో సాహిల్, ఆయ‌న‌ తల్లితో కలిసి మేం పోలీసు అధికారులను కలిశాం. అలాగే దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నాం. సాహిల్ ఫిర్యాదుపై కనీసం ‘దర్యాప్తు నంబర్’ కూడా ఇవ్వలేదు. అది లేకుండా ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం అసాధ్యం. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్‌కు జత చేయాల్సిన సాహిల్ ఎంఎల్‌సి (మెడికో-లీగల్ కేస్) నివేదికను కూడా ఎయిమ్స్‌కు ఇంకా అందించలేదు. ఇది స్పష్టమైన అన్యాయం. అమిత్ షా, ఢిల్లీ పోలీసులు వినండి. ఈ నియంతృత్వ ధోరణిని ఇకపై సహించం. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసేందుకు మేము పూర్తి శక్తితో పోరాడుతూనే ఉంటాం’’ అని రాహుల్‌‌గాంధీ అన్నారు.
‘‘ఈ ఆందోళ‌నతో పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. న్యాయం దిశగా ఇది మొదటి అడుగు. కేసు నమోదైంది. మేము ఉదయం 11:30 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వచ్చాం. కానీ సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో నమోదైంది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న పోలీస్ స్టేషన్‌లోనే న్యాయం పొందడానికి ఇంత సమయం పడితే, ఇక గ్రామాలు, చిన్న పట్టణాల్లోని పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన విషయం. అమిత్ షా తుది అనుమతి ఇచ్చిన తర్వాతే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అటువంటి పరిస్థితిలో, ఎఫ్‌ఐఆర్ నమోదును ఎవరు అడ్డుకున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలనుకున్నారు. కానీ ‘పై’ స్థాయి నుంచి న్యాయ ప్రక్రియకు అడ్డుకట్ట వేయబడింది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -