డంపింగ్ యార్డ్ లో మళ్లీ చెలరేగిన మంటలు

– దట్టమైన పొగలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పరిసర ప్రాంతాల ప్రజలు

నవతెలంగాణ – భగత్ నగర్
కరీంనగర్ డంపింగ్ యార్డ్ మళ్ళీ మండుతోంది. అసలే ఎండాకాలం ఆపై నలబై ఐదు డిగ్రీలు దాటి నమోదవుతున్న ఎండలతో సతమతం అవుతున్న ప్రజలు ఇంట్లో అయినా సేద తీరుదాం అంటే డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న పొగ , కాలుష్యం  పరిసర ప్రాంత ప్రజలను  ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఈ మంటలు రాత్రయినా అదుపులోకి రాకపోగా నగరం అంత పొగ వ్యాపించి ” ఇది ప్రళయాగ్ని వోలె”  పద్యాన్ని తలపిస్తోంది. అంతకంతకు  పొగ ఎక్కువ అవుతూ పరిసర ప్రాంతాలైన ఆటోనగర్, కోతిరాంపూర్,లక్ష్మీనగర్,గాయత్రినగర్,  హౌసింగ్ బోర్డు కాలనీ వరకు వ్యాపిస్తోంది.ఈ కాలుష్యం ధాటికి ప్రజలు ,వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఇంత జరుగుతున్నా బల్దియా అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. రోజుల వ్యవధి లో మళ్ళీ మళ్ళీ మంటలు అంటుకుని డంపింగ్ యార్డ్ మండుతున్నా,ప్రజారోగ్యం ప్రమాదం లో ఉన్నా జిల్లా యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Spread the love