పారదర్శకంగా ఈవీఎం యంత్రాల ఎఫ్‌ఎల్‌సీ నిర్వహణ

– పెద్దపల్లి కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ
నవతెలంగాణ-పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా ఈవీఎం ఎఫ్‌ఎల్‌సి(ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌)ను ఈసీఐఎల్‌ ఇంజినీర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉంచిన ఈవీఎం మిషన్ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ 15 మంది ఈసీఐఎల్‌ ఇంజీనీర్ల ఆధ్వర్యంలో జరుగుతుందని, జిల్లాకు వచ్చిన ప్రతి ఈవీఎం యంత్రంలోని బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్ల పని తీరు పరిశీలిస్తారని చెప్పారు. ఈవీఎం ఎఫ్‌.ఎల్‌.సిపై 3 రోజుల కిందట అన్ని రాజకీయ పక్షాలకు సమాచారం అందించామని, సీజ్‌ చేసిన ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో తెరిచామని తెలిపారు. 1509 బ్యాలెట్‌ యూనిట్‌లను, 1179 కంట్రోల్‌ యూనిట్‌లను, 1270 వివి ప్యాట్‌లను ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌ అధికారి వెంకట మాధవరావు, ఈడిఎం కవిత, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీన్‌, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love