– నిబంధనలు పాటించని నిర్వాహకులకు నోటీసులు
నవతెలంగాణ – అశ్వరావుపేట
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలనే ఉద్దేశంతో గురువారం అశ్వారావుపేట లో పలు హోటళ్లు, ఢాబాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ.శరత్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లు, ఢాబాల్లో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట శాలల నిర్వహణ, ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు, సిబ్బంది ఆరోగ్య ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు.తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ – 2006 ప్రకారం మొత్తం 5 యాక్ట్ నమూనాలు, 12 సర్వైలెన్స్ నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు.
నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించని హోటళ్లు, ఢాబాల నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారికి ఒక వారం గడువు ఇచ్చి, తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని ఆదేశించారు. గడువులోగా లైసెన్సులు పొందని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ. శరత్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆహార వ్యాపారులు పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ, నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగదారులకు అందించాలని సూచించారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీలలో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.



