గృహజ్యోతి కోసం లక్షలాది మంది ఎదురుచూపు

For home lighting..
– రాష్ట్రవ్యాప్తంగా 1.05కోట్ల మందికి అర్హత ఉన్నా.. 34.59 లక్షల మందికి మాత్రమే లబ్ది
– రేషన్‌కార్డు లేదని అర్హత పొందని వైనం
– కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం అమల్లో అర్హులు సైతం లబ్దిపొందలేక పోతున్నారు. గృహజ్యోతి పథకానికి విధిగా రేషన్‌కార్డు ఉండాలనే నిబంధన పేదలకు పెద్ద ఆటంకంగా మారింది. ఎన్నో ఏండ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. దాంతో చాలా మంది ఆరు గ్యారం టీ పథకాల్లో లబ్దిదారులు కాలేకపోతు న్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగి స్తున్నప్పటికీ ప్రజా పాలన దరఖా స్తుల్లో రేషన్‌కార్డు నెంబర్‌ ఎంటర్‌ చేయలేదన్న నెపంతో వాళ్లందర్నీ అనర్హులుగా పక్కన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు జారీ చేసి అర్హులందరికీ ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కోరుతూ నిత్యం ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకం కింద.. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తూ రేషన్‌కార్డు కలిగిన వాళ్లందరికీ జీరో బిల్లు ఇస్తూ ఉచిత విద్యుత్‌ను రాష్ట్రవ్యాప్తంగా వర్తింపజేస్తున్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తుల్ని స్వీకరించిన ప్రభుత్వం వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసింది. దరఖాస్తుదారులు విద్యుత్‌ సర్వీస్‌ నెంబర్‌, తెల్లరేషన్‌కార్డు నెంబర్‌ నమోదు చేయాల్సి ఉంది. అలా నమోదు చేయని దరఖాస్తుల్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే సమయంలో రేషన్‌కార్డు నెంబర్‌లేకపోవడంతో అర్హులుగా గుర్తించలేదు. విద్యుత్‌ అధికారుల లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వినియోగదారుల సంఖ్య 1.05 కోట్లు. వీరిలో ఎంతమందికి రేషన్‌కార్డు లు ఉన్నాయో తెలియని పరిస్థితి. దాంతో ఇందులో సగం మందికి కూడా జీరో బిల్లు వస్తుందా.. లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.
34.59 లక్షల మందికి మాత్రమే లబ్ది
గృహజ్యోతి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 34,59,585 మంది వినియోగదారులు లబ్ది పొందుతున్నారు. వారి బిల్లుల కోసం రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.125 కోట్లు డిస్కంలకు విడుదల చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉచిత గృహలక్ష్మి పథకం కింద లబ్దిపొందేందుకు ప్రజాపాలన కార్యక్రమంలో 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 64,57,891 దరఖాస్తులు ఆధార్‌తో అనుసంధానమై తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 34,59,585 మంది దరఖాస్తుదారులకు గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. వీరికి మాత్రమే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు జీరో బిల్లు ఇస్తున్నారు.
జీరో బిల్లు వస్తున్న వాళ్లందరికీ విద్యుత్‌ సబ్సిడీ వర్తిస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 4,71,456 మంది వినియోగ దారులు లబ్దిపొందుతున్నారు. జూన్‌ నెలలో జీరో బిల్లు వచ్చిన లబ్దిదారుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో 1,75,464 మంది లబ్దిదారులు ఉచిత విద్యుత్‌ సదుపాయంతో రూ.6.63 కోట్ల రాయితీ పొందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 1,81,365 మందికి ఉచిత విద్యుత్‌ ద్వారా రూ.6.10 కోట్ల రాయితీ లభిస్తుంది. మెదక్‌ జిల్లాలో 1,14,627 మంది లబ్దిదారులకు రూ.2.19 కోట్ల రాయితీ లభిస్తుంది. నెల నెలా గృహలక్ష్మీ పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న వాళ్లకు మాత్రమే పథకం వర్తింపచేస్తున్నారు. మొదట్లో లబ్దిదారులుగా గుర్తించబడిన తర్వాత ఇటీవల వేసవి అవసరాల నిమిత్తం ఫ్యాన్లు, కూలర్లు వాడినందుకు 200 యూనిట్ల కంటే కొంచెం ఎక్కువ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిం చడంతో జీరో బిల్లు రాలేదు. అలాంటి వినియోగదారుల్ని గుర్తించిన విద్యుత్‌ శాఖ సిబ్బంది వినియోగదారుల నుంచి మొత్తం బిల్లు వసూలు చేశారు.
కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూపు
కొత్తగా వివాహమైన కుటుంబాల్లో వారు వేరుగా కాపురాలు పెట్టారు. చిన్నపాటి ఇండ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొందరు కిరాయి ఇండ్లలో నివాసముంటున్నారు. ఉమ్మడి కుటుంబం రేషన్‌కార్డు నెంబర్‌పైన ఒక ఇంటికే లబ్ది చేకూరుతుంది. ఆ కుటుంబం నుంచి వివాహమై, వారి పిల్లలూ పెద్దయ్యారు. రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. దాంతో చాలా మంది గృహజ్యోతి పథకానికి అర్హులు కాలేక పోతున్నారు. గృహజ్యోతి పథకం దరాఖా స్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాక విద్యుత్‌ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. అయితే వందలాది కుటుంబాలు వేర్వేరుగా ఉండటంతో ఒకే రేషన్‌కార్డు ఉన్నందున వాళ్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అలాగే గత ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో రేషన్‌కార్డుల్ని మంజూరు చేయలేదు. రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో జన్మించిన వాళ్ల పేర్లను కూడా రేషన్‌కార్డుల్లో నమోదు చేయలేదు. ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సర్వీస్‌ నెంబర్‌ను ఎడిట్‌ చేసుకునే చాయిస్‌ ఇచ్చిన ప్రభుత్వం రేషన్‌కార్డు నెంబర్‌ను ఎంటర్‌ చేసేందుకు మాత్రం ఎడిట్‌ చాయిస్‌ ఇవ్వలేదు. గృహజ్యోతి పథకం కోసం ప్రజాపాలనలో 8.20 లక్షల వరకు దరఖా స్తులు వచ్చాయి. వాటిల్లో 3.5 లక్షల వరకు రేషన్‌కార్డు నెంబర్‌ నమోదు చేయలేదని అనర్హులుగా గుర్తించారు. కొందరు రేషన్‌కార్డు ఉన్నా ప్రజాపాలన సమయంలో వివరాలు పేర్కొనలేదు. వాళ్లకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు. దాంతో ఈ 3.5 లక్షల మంది ఉచిత విద్యుత్‌ కోసం గ్రామాలకు చెందిన ప్రజలు ఎంపీడీఓ, పట్టణ ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
రేషన్‌కార్డు లేదని ఉచితం ఇస్తలేరు : పద్మమ్మ, సంగారెడ్డి
రేషన్‌కార్డు కోసం ఎన్నో ఏండ్లుగా దరఖాస్తు చేస్తూ వస్తున్నాం. ఇంతవరకు మంజూరుకాలేదు. చిన్నపాటి ఇంట్లో ఉంటు న్నాం. మాకు నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ కంటే ఎక్కువ వినియోగించే పరిస్థితి లేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేశాం. అయినా మాకు ఉచిత విద్యుత్‌ ఇస్తలేరు. ప్రభుత్వం రేషన్‌కార్డు మంజూరు చేసి గృహజ్యోతి కింద లబ్దిచేకూరేలా చూడాలి. రోజువారి కూలీ మీద బతికే మాలాంటి వాళ్లకు కూడా ఉచిత విద్యుత్‌ ఇస్తలేరు.
రేషన్‌కార్డు ఉండి 200 యూనిట్లలోపు వాడితే ఉచితం: మాదవరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వాళ్లు గృహజ్యోతి పథకం కింద లబ్దిపొందాలంటే రేషన్‌కార్డు కలిగి ఉండాలి. అలా రేషన్‌కార్డు ఉంటి దరఖాస్తు చేసిన వాళ్ల వివరాల్ని సర్వే చేసి లబ్దిదారులుగా గుర్తించాం. రేషన్‌కార్డు లేని వాళ్లు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిం చినప్పటికీ ఉచితం కింద లబ్దిపొందడానికి వీలుకాదు.
200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తే ఉచితం వర్తించదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పథకాన్ని అమలు చేస్తున్నాం.

Spread the love