న్యాయం కోసం

న్యాయం కోసం– టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో 500 రోజులుగా యువత ఆందోళన
– యోగి సర్కారుపై ఆగ్రహం
లక్నో : యూపీలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌పై అక్కడి యువత ఎడతెగని పోరాటం చేస్తున్నది. న్యాయం కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. 500 రోజులకుపైగా వారు ఆందోళన లు చేస్తున్నారు. యూపీలో అసిస్టెంట్‌ టీచర్లు, ఇతర 69,000 టీచర్‌లో నియామకాలతో పాటు వివిధ రిక్రూట్‌మెంట్లలో జరిగిన కుంభకోణం లో న్యాయం చేయాలని యువత ఎక్కువగా డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి తమ సందేశాన్ని తెలియజేయడానికి సోషల్‌ మీడియాలో వీరి తరఫున ప్రచారం జరుగుతున్నది. చర్యలు తీసుకోవటంలో విఫలమైన యోగి సర్కారు తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తి కానున్నది. ఇటు యూపీలో ముఖ్యమంత్రిగా యోగి రెండో సారి అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ, ఉద్యోగాలు వంటి వాగ్దానాల జాబితా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందని అక్కడి యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి యువత, నాయకుల మాటలు నిజమని నమ్మి, కోచింగ్‌ కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారనీ, ఇంటికి దూరంగా ఉంటూ, వయస్సు మీద పడిపోతుంటే నిరాశ, నిస్పృహలతో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళనకారు లు అంటున్నారు. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఇప్పటివరకు తమకు ఇచ్చిన హామీలలో 1 శాతం కూడా నెరవేర్చలేదని వాపోతున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్‌ రిక్రూట్‌మెంట్‌, ఎల్టీలు, పోలీసు శాఖలో దాదాపు 6 లక్షల ఖాళీ పోస్టులను పునరుద్ధరించాలని గత కొన్నేండ్లుగా యువమంచ్‌ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తున్నది. కానీ, ఇక్కడి ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్లను పట్టించు కోవడం లేదు. మరోసారి, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు యోగి సర్కారు పిలవటంతో.. తమ అభిప్రాయాలను సభలో లేవనెత్తవచ్చనే ఆశ యువతలో తలెత్తింది.
తన డిమాండ్లను అసెంబ్లీకి తెలియజేయడానికి యువ మంచ్‌ రాష్ట్ర కార్యవర్గం సామాజిక మాధ్యమాల ద్వారా ఉపాధి సమస్య మీద ఉద్యమించాలనీ, డిసెంబరు మొదటి వారంలో ఉద్యమానికి దిగాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగాల విషయమై యువమంచ్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించగా.. అందులో ఖాళీగా ఉన్న 6 లక్షల పోస్టుల భర్తీకి ఎన్నికల హామీని అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
సంయుక్త యువమోర్చా కేంద్ర బృందం సభ్యుడు, యువమంచ్‌ కన్వీనర్‌ రాజేష్‌ సచన్‌ మాట్లాడుతూ.. 6 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తా మని, పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరి స్తామని ఎన్నికల హామీపై ప్రభుత్వం సీరియస్‌గా లేదని అన్నారు. గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతనీ, ఉద్యోగ హక్కుల కోసం శాంతియుతంగా గళం విప్పడం యువత ప్రజాస్వామిక హక్కు అనీ, అయితే ప్రభుత్వం శాంతి యుత ఉద్యమాలను అణిచి వేసేందుకు పూనుకున్న దని తెలిపారు. 69 వేల టీచర్‌ రిక్రూట్‌మెంట్‌లో రిజర్వేషన్‌ స్కామ్‌లో బాధితులైన అభ్యర్థులకు సత్వర న్యాయం చేయాలని సీపీఐ (ఎంఎల్‌) విజ్ఞప్తి చేసింది. రిజర్వేషన్‌ స్కామ్‌ బాధితులు గత కొన్ని నెలలుగా లక్నోలోని ఎకో గార్డెన్‌లో నిరసనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు ఎకో గార్డెన్‌ గేట్‌ వద్దకు వచ్చారు. ఈ అభ్యర్థులకు సీపీఐ (ఎంఎల్‌) మద్దతుగా నిలిచింది. ప్రభుత్వం తన తప్పు లను కప్పి పుచ్చుకునేందుకు అభ్యర్థులపై నిందలు వేస్తున్నదని ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ-ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నదని ఆరోపించింది. లక్నోలోని ఎకో గార్డెన్‌లో 526 రోజు లకు పైగా కొనసాగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విజరు కుమార్‌ మాట్లాడుతూ.. ”69,000 టీచర్‌ రిక్రూట్‌మెంట్‌లకు మేమంతా అభ్యర్థులం. మా నిరసన 526 రోజులకు పైగా సాగుతున్నది. మేము ఎకో గార్డెన్‌లో ఆందోళన చేయవలసి వచ్చింది. మా ఏకైక డిమాండ్‌ జాతీయ వెనుకబడిన కమిషన్‌ను ప్రభుత్వం వినాలనేది. 2021, ఏప్రిల్‌లో కమిషన్‌ నివేదిక.. 69,000 మంది టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో రిజర్వేషన్‌ స్కామ్‌ జరిగిందని అంగీకరించింది. యూపీ ప్రభుత్వానికి లేఖ పంపింది. స్కాంలో ప్రభావితమైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో పేర్కొన్నది” అని తెలిపారు.

Spread the love